ఇది మనీష్‌ పాండే వికెట్‌!

17 Jan, 2020 18:22 IST|Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(15) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ వేసిన నాల్గో ఓవర్‌ రెండో బంతికి ఆఫ్‌ సైడ్‌కు హిట్‌ చేయగా, మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. బంతి గమనాన్ని అంచనా వేసిన మనీష్‌ పాండే సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ను అమాంతం పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్‌కు స్టేడియంలో ప్రేక్షకులకు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురి కాగా, వార్నర్‌ మాత్రం షాక్‌కు గురయ్యాడు. ఫోర్‌ వెళుతుందనుకున్న ఆ షాట్‌ను పాండే క్యాచ్‌గా అందుకోవడంతో వార్నర్‌ కాసేపు అలానే ఉండిపోయాడు. (ఇక్కడ చదవండి; ఆసీస్‌కు భారీ టార్గెట్‌)

మనీష్‌  పాండే అసాధారణ ఫీల్డింగ్‌తో టీమిండియా శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఇది షమీ వికెట్‌ అనడం కంటే పాండే వికెట్‌ అంటేనే సబబు. అది క్యాచ్‌గా అందుకుంటాడని ఎవరూ ఊహించని సమయంలో పాండే కచ్చితమైన టైమింగ్‌తో గాల్లోకి ఎగిరి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. 

ఆసీస్‌ స్కోరు 20 పరుగుల వద్ద వార్నర్‌ ఔట్‌ కావడంతో ఫస్ట్‌ డౌన్‌లో స్టీవ్‌ స్మిత్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది.. శిఖర్‌ ధావన్‌(96; 90  బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించి భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. (ఇక్కడ చదవండికోహ్లి బ్యాడ్‌లక్‌)

మరిన్ని వార్తలు