జాఫర్ సెంచరీల ‘హాఫ్ సెంచరీ’

29 Nov, 2013 01:27 IST|Sakshi

ముంబై: భారత మాజీ ఓపెనర్, ముంబై ఆటగాడు వసీం జాఫర్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. విదర్భతో గురువారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో శతకం (133 బ్యాటింగ్)తో జాఫర్ ఈ ఘనత సాధించాడు. జాఫర్‌కు ముందు గవాస్కర్, సచిన్ (81), ద్రవిడ్ (68), విజయ్ హజారే (60), వెంగ్సర్కార్, లక్ష్మణ్ (55), అజహర్ (54) ఈ జాబితాలో ఉన్నారు.
 
 శుక్లా ‘సెంచరీ’: సర్వీసెస్‌తో ఢిల్లీలో  ప్రారంభమైన మరో మ్యాచ్‌లో బెంగాల్ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో శుక్లా రంజీ ట్రోఫీలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. శుక్లా ఈ ఘనత సాధించిన తొలి బెంగాల్ క్రికెటర్ కాగా, ఓవరాల్‌గా 18వ భారత ఆటగాడు. తొలి ‘కవలలు’: తమిళనాడుకు చెందిన బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ భారత దేశవాళీ క్రికెట్‌లో కొత్త ఘనతను అందుకున్నారు. భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన తొలి కవల సోదరులుగా వారు రికార్డు సృష్టించారు. చెన్నైలో గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌తో బాబా ఇంద్రజిత్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అపరాజిత్ ఇప్పటికే 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.
 

మరిన్ని వార్తలు