విరాట్ సేన గెలిస్తేనే..

1 Oct, 2017 10:27 IST|Sakshi

నాగ్ పూర్:ఆస్ట్రేలియాతో ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలో విజయం ద్వారా టాప్ ర్యాంకు చేరిన టీమిండియా ఇప్పుడు ఆ ర్యాంకును కాపాడుకునే పనిలో పడింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా బెంగళూరులో జరిగిన నాల్గో వన్డేలో ఓటమి పాలు కావడం భారత జట్టు నంబర్ వన్ ర్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో పరాజయం చెందడంతో 119 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో  కొనసాగుతోంది. ఒకవేళ ఐదో వన్డేలో టీమిండియాకు ఓటమి ఎదురైతే మాత్రం రెండో ర్యాంకుకు పరిమితం కావాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచిన పక్షంలోనే 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకుంటుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరీస్ ను గెలిచిన విరాట్ సేన.. ఇక చివరి వన్డేలో గెలిచి టాప్ ర్యాంకును నిలుపుకోవడంపైనే దృష్టి పెట్టింది. ఆదివారం ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆఖరిదైన ఐదో వన్డే జరుగనుంది. మధ్యాహం గం.1.30 ని.లకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత జట్టు నాలుగు వన్డే మ్యాచ్ లు ఆడగా రెండింట మాత్రమే గెలిచింది. ఆ రెండు విజయాలు కూడా ఆస్ట్రేలియాపైనే రావడం ఇక్కడ విశేషం. ఇక్కడ శ్రీలంక(2009), దక్షిణాఫ్రికా(2011)పైనే మాత్రమే భారత ఓటమి చెందింది. ఓవరాల్ గా ఇప్పటివరకూ నాగ్ పూర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లు ఏడు.


కేఎల్ రాహుల్ కు అవకాశం దక్కేనా!

ఇప్పటికే భారత జట్టు వన్డే సిరీస్ ను 3-1తో గెలిచిన పక్షంలో మరొకసారి ప్రయోగాలకు పెద్ద పీట వేసే అవకాశం ఉంది. గత మ్యాచ్ ద్వారా అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీలకు చోటు కల్పించిన టీమిండియా సెలక్టర్లు.. ఐదో వన్డేలో సైతం మార్పులు చేయొచ్చు. ఒకవేళ చివరి వన్డేలో మార్పులు చేస్తే కనుక కేఎల్ రాహుల్ తుది జట్టులోకి రావొచ్చు. ఇప్పటివరకూ ఈ సిరీస్ లో ఇంకా రాహుల్ ఆడని కారణంగా అతనికి అవకాశం లభించవచ్చు. మరి రాహుల్ కు అవకాశం దక్కితే మాత్రం మనీష్ పాండే, కేదర్ జాదవ్ ల్లో ఒకరికి విశ్రాంతి తప్పకపోవచ్చు. మరొకవైపు గత మ్యాచ్ లో ఆడని బూమ్రా, భువనేశ్వర్ లు రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావచ్చు. యజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చేఅవకాశం ఉంది.

అంచనా;

భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, కేదర్ జాదవ్, అజింక్యా రహానే, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, హ్యాండ్ స్కాంబ్, స్టోనిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, కౌల్టర్ నైల్,కేన్ రిచర్డ్ సన్,ఆడమ్ జంపా

>
మరిన్ని వార్తలు