ఆ టేస్ట్‌ షమీకి లేదు: సాహా

26 Nov, 2019 16:11 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత క్రికెటర్‌ వృద్ధిమాన్ సాహా టెస్టు ఫార్మాట్‌లో బెస్ట్‌ వికెట్‌కీపర్‌గా ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. వికెట్ల వెనుక వేగంగా కదులుతూ బంతి కోసం అతను చేసే విన్యాసాలు అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహా పలుమార్లు డైవ్‌ చేస్తూ క్యాచ్‌లు అందుకున్న సంగతి ఎవరు మరిచిపోలేరు. అయితే సాహా ఆటలో ఎంత చురుకుదనం ప్రదర్శిస్తాడో మైదానం బయట అంతే చలాకీగా ఉంటాడు.

తాజాగా ఈఎస్‌పీఎన్‌ నిర్వహించిన ఇంటర్యూలో వృద్ధిమాన్ సాహా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో సంగీతం మీద అవగాహన లేకుండా ఎవరైనా ఉన్నారా అని సాహాను అడగగా.. అతను తడుముకోకుండా మహ్మద్‌ షమీ పేరు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో అందరికి సంగీతం మీద అంతో ఇంతో ఇష్టం ఉంది. కానీ షమీకి మాత్రం సంగీతం మీద ఏ మాత్రం అవగాహన లేదన్నాడు. అయితే మైదానంలో మాత్రం షమీ తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెడుతూ వికెట్లను కొల్లగొడుతాడని తెలిపాడు. ఈ సందర్భంగా రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తాను, పుజారా కలిసి ఆస్ట్రేలియన్స్‌పై స్లెడ్జింగ్‌కు దిగామని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్‌నే తాము కాపీ కొట్టామని సాహా పేర్కొన్నాడు.

కోల్‌కతాలో బంగ్లాతో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఓవర్లో ఓపెనర్‌ షాదమన్‌ ఇస్లామ్‌ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా సాహా టెస్టుల్లో భారత్‌ తరపున 100 డిస్మిల్స్‌ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహా ప్రదర్శనకు ముగ్దుడైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 'ప్రస్తుత ఉపఖండపు పరిస్థితుల్లో సాహా ఒక ఉత్తమ వికెట్‌ కీపర్‌' అంటూ అప్పట్లో ప్రశంసలతో ముంచెత్తాడు.

మరిన్ని వార్తలు