‘రై’ వ్యాఖ్యలతో... రగడ..

13 Jul, 2016 01:36 IST|Sakshi
‘రై’ వ్యాఖ్యలతో... రగడ..

ఉభయసభల్లో రెండోరోజూ  ప్రతిధ్వనించిన గణపతి ఉదంతం
 మంత్రి రామనాథ్ రై వ్యాఖ్యలతో సభల్లో గందరగోళం
హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన   గణపతి కుటుంబ సభ్యులు

 

బెంగళూరు: డీఎస్పీ గణపతి అంశంపై మంగ ళవారం కూడా ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సమయంలో మంత్రి రామనాథ్ రై చేసిన వ్యాఖ్యలు శాసనసభలో మరింత వేడిని పెంచాయి. ఒకానొక సందర్భంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ముష్టి యుద్ధాలకు దిగుతారా అనే సందేహం కూడా ఏర్పడింది. దీంతో సభా కార్యకలాపాలను కాసేపు వాయిదా పడ్డాయి. వివరాలు.... డీఎస్పీలు గణపతి, కల్లప్ప హండిభాగ్‌ల ఆత్మహత్య ఘటనలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కె.జి.బోపయ్య మాట్లాడుతుండగా, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామనాథ్ రై కలగజేసుకున్నారు. ‘కల్లప్ప ఆత్మహత్య వెనక ఉన్న నిజాలు మాకు తెలుసు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బీజేపీ శాసనసభ్యులు మీకు తెలిసిన నిజాలేమిటో బయటపెట్టండి అంటూ రామనాథ్ రై పై మండిపడ్డారు. ఈ సందర్భంలో అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఎవరు ఏం చెబుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ధర్నా చేపట్టారు. ఆ సమయంలో మొదటి వరుసలోనే మంత్రి రామనాథ్ రై ఉండడంతో ఇరు పక్షాల సభ్యులు ఇక గొడవకు దిగుతారా అనే పరిస్థితి శాసనసభలో ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కోళివాడ మార్షల్స్‌ను సభలోకి రప్పించి మంత్రులకు రక్షణ ఇవ్వాల్సిందిగా సూచించారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం కలగజేసుకుంటూ ‘ఏది ఏమైనప్పటికీ సభలో ఇలాంటి చర్యలు సరికాదు’ అని సూచించారు. అధికార పక్ష సభ్యుడు వసంత బంగేర, మంత్రి రామనాథ్ రైకు సర్ది చెప్పడంతో పరిస్థితి కాస్తంత సద్దుమనిగింది.

అంత సంతోషం దేనికి....
ఇక డీఎస్పీ ఆత్మహత్య అంశంపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ...‘రాష్ట్ర ప్రజలు ఇద్దరు డీఎస్పీల ఆత్మహత్యతో దుఃఖంలో ఉంటే సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్‌లు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఈ ఆదివారం సీఎం సిద్ధరామయ్య, హోం శాఖ మంత్రి పరమేశ్వర్‌లు ఓ కార్యక్రమంలో పాల్గొని, చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్న చిత్రాలు చాలా పత్రికల్లో వచ్చాయి. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న వీరు తమ పాటికి తాము హాయిగా ఉన్నారు’ అని విమర్శించారు. ఈ సందర్భంలో సీఎం సిద్ధరామయ్య కలగజేసుకుంటూ ‘అది మా పార్టీ కార్యక్రమం, రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందో మీరు సరిగ్గా చెప్పండి, ఏదో గాలివాటుగా ఆరోపణలు గుప్పించడం సరికాదు,  అని సమాధానం చెప్పారు.
 
శాసనసభలో స్పష్టత ఇచ్చిన జార్జ్.....
కాగా డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంలో తనపై వస్తున్న ఆరోపణలకు మంత్రి జార్జ్ శాసనసభలో స్పష్టత ఇచ్చారు. ‘అధికారం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. అధికారం వస్తుంది, పోతుంది, అయితే నేను మాత్రం నా ఆత్మసాక్షికి వ్యతిరేకంగా ఎప్పుడూ న డుచుకోలేదు. గణపతి ఆత్మహత్యకు ముందు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర ్వ్యూ నేను చూశాను. అందులో 2008లో జరిగిన చర్చిపై దాడి ఘటనను ఉల్లేఖించారు. 2013 జూన్ 19న నేను మంగళూరు వెళ్లాను, ఆర్చ్ బిషప్ ఇంటికి, ఉల్లాల దర్గాకు వెళ్లాను, మంగళూరు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి పాత్రికేయులతో మాట్లాడి బెంగళూరు తిరిగి వచ్చాను. ఆ సమయానికి గణపతిపై ఎవరూ నాకు ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత గణపతి సస్పెన్షన్ తదితర దేనితోను నాకు సంబంధం లేదు అని పేర్కొన్నారు.
 
శాసనమండలిలోనూ అదే తీరు...
 గణపతి ఆత్మహత్య అంశం శాసనమండలిలో సైతం ప్రతిధ్వనించింది. మంత్రి జార్జ్ రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్షాలు మంగళవారం సైతం తమ నిరసనను కొనసాగించాయి. ఇదే సందర్భంలో గణపతి ఆత్మహత్య అంశాన్ని సీబీఐకి అప్పగించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ సందర్భంలో శాసనమండలిలో విపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘గణపతి ఆత్మహత్య అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అతని మానసిక స్థితి సరిగా లేదని అంటున్నారు. అంతేకాక ఆయన వ్యక్తిగత జీవితంలో సైతం ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. మంత్రి జార్జ్‌ను రక్షించేందుకే గణపతి కుటుంబంపై నిందలు మోపుతున్నారు అని అన్నారు. ఈ సమయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్ కలగజేసుకుంటూ ‘నిజానిజాలు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు.
 
హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం....
 ఇక డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఉదంతానికి సంబంధించి ఆయన కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఆత్మహత్యకు ముందు డీఎస్పీ ఏ అధికారుల పేర్లను, మంత్రి పేరును ఉల్లేఖించారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కుశాలనగర పోలీస్ స్టేషన్‌ను గణపతి భార్య పావన, ఎం.జి.నేహాల్‌లు కోరారు. అయితే వీరి ఫిర్యాదును కుశాలనగర పోలీసులు నమోదు చేసుకోక పోవడంతో గణపతి కుటుంబం ఈ మెయిల్ ద్వారా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. దీంతో స్పందించిన హెచ్‌ఆర్‌సీ పూర్తి నివేదిక అందజేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు