పేకాటలో రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడు

25 Sep, 2016 17:41 IST|Sakshi
పేకాటలో రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడు

చిత్తూరు (అర్బన్‌): పేకాట వ్యసనంతో దాదాపు రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడో వ్యాపారి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తమిళనాడులోని వేలూరు ఎస్పీ పగలవన్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాకాల మండలానికి చెందిన ఓ వ్యాపారి తిరుపతిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి పేకాట బలహీనత. ఈ నేపథ్యంలో చిత్తూరుకు చెందిన బీగాల్‌ సురేష్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

సురేష్‌ పేకాట జరిపిస్తూ రోజుకు జరిగే లావాదేవీల్లో 10 శాతం కమిషన్‌ తీసుకుంటాడని, పేకాటలో డబ్బు పోగొట్టుకున్న వాళ్లకు రోజుకు రూ.10 వడ్డి చొప్పున అప్పులు ఇస్తుంటాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇతని మాయలో పడ్డ తాను ఆరు నెలలుగా పేకాటకు మరింత బానిస అయినట్లు ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే సురేష్‌ను చిత్తూరు పోలీసులు పలుమార్లు అరెస్టు చేసినట్లు చెప్పాడు. కొంత కాలంగా సురేష్‌.. పొన్నై, వేలూరు, గుడియాత్తం ప్రాంతాల్లో ఓ వాహనం తిప్పుతూ అందులో పేకాట నిర్వహించి తన వద్ద రూ.5 కోట్ల వరకు కాజేసినట్లు వాపోయాడు.

ఈ విషయం చిత్తూరు పోలీసులకు చెప్పడంతో.. పేకాట తమిళనాడులో సాగడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారన్నాడు. బీగాల్‌ సురేష్‌ ఫొటోను సైతం ఎస్పీకి అందజేశాడు. కేసు నమోదు చేసిన వేలూరు పోలీసులు సురేష్‌ కోసం గాలిస్తున్నారు. ఇతనితో పాటు పేకాట స్థావరాల్లో అధిక వడ్డీలకు నగదు ఇచ్చే మరో ముగ్గురు వ్యక్తుల కోసం సైతం తమిళనాడు పోలీసులు చిత్తూరులో గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు