'నిరుద్యోగ యువతను వంచించారు'

4 Oct, 2016 11:30 IST|Sakshi
'నిరుద్యోగ యువతను వంచించారు'
యువజన కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన
ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక హెచ్‌సీఎం జూనియర్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం కలెక్టరేట్‌ వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గుర్రాల రాజ్‌విమల్‌ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను నయవంచనకు గురిచేశాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని అమలు చేయకపోగా అనేక మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించి వీధులపాలు చేసిందని ధ్వజమెత్తారు.

ఉద్యోగాలు వచ్చేవరకు నెలకు రెండువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ దానిని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో లక్షా యాభై వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఎద్దు శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, ఎద్దు కోటి, షేక్‌ సైదా, ఈదా సుధాకరరెడ్డి, నవీన్‌రాయ్‌  తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు