మూడేళ్లలో ఎత్తినహొళె పూర్తి

20 Feb, 2014 04:58 IST|Sakshi
  • ఐదు ప్యాకేజీల్లో టెండర్ల ఆహ్వానం..
  • నాలుగు జిల్లాల్లో తాగు నీటి సమస్య పరిష్కారం
  • పంచాయతీల పునర్విభజనకు కమిటీ
  • నివేదిక అందిన తర్వాత కార్యాచరణ
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ, తుమకూరు జిల్లాల ప్రజలకు తాగు నీరు అందించడానికి ఉద్దేశించిన ఎత్తినహొళె పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి ఎంబీ. పాటిల్ తెలిపారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ పథకాన్ని తొలి దశలో చేపట్టడానికి ఐదు ప్యాకేజీల్లో టెండర్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మూడేళ్లలో పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పథకానికి ఎక్కడ శంకుస్థాపన చేయాలనే విషయమై ఇంకా నిర్ణయించ లేదన్నారు.
     
    టోల్ రాయితీ
     
    బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో జాతీయ రహదారిపై నిర్మించిన టోల్ వద్ద స్థానికులకు సుంకం చెల్లింపులో రాయితీలు కల్పిస్తామని ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప హామీ ఇచ్చారు. శాసన సభలో జీరో అవర్‌లో సభ్యుడు మునిశామప్ప అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆ టోల్‌ను నిర్మించామని చెప్పారు. హైవే అథారిటీ ఒప్పందం ప్రకారం టోల్ వసూలు చేస్తారని చెప్పారు. అయితే స్థానికులతో పాటు ఆ మార్గంలో నిత్యం సంచరించే వారికి రాయితీలు ఇస్తామని ఆయన వెల్లడించారు.
     
    పంచాయతీల పునర్విభజనకు వారంలోగా కమిటీ
     
    రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్విభజనకు సంబంధించి వారంలోగా కమిటీని నియమిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ శాసన సభకు తెలిపారు. శాసన సభలో శశికళ అన్నా సాహెబ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ర్టంలో పలు చోట్ల పునర్విభజన సమస్యలున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల పంచాయతీ సభ్యుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందని, విస్తీర్ణం కూడా ఎక్కువేనని చెప్పారు. అలాంటి పంచాయతీలను విభజించాల్సి ఉందన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాత పునర్విభజన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. కాగా ప్రతి పంచాయతీకి వివిధ పథకాల కింద ఏటా రూ.3 కోట్ల గ్రాంట్లు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
     

>
మరిన్ని వార్తలు