-

పవర్ రేట్ ‘కట్’!

21 Jan, 2014 00:22 IST|Sakshi

ముంబై: రాష్ట్రంలో మహావితరణ్ ద్వారా పంపిణీ చేస్తున్న విద్యుత్ టారిఫ్‌ను తగ్గించాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ఆప్ సర్కార్ విద్యుత్ టారిఫ్‌లో 50 శాతం సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చవాన్ సర్కార్‌పై విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనూ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గృహ, పారిశ్రామిక, చేనేత రంగాలకు విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న మహావితరణ్ (మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీ) వసూలు చేస్తున్న ధరల్లో 15 నుంచి 20 శాతం తగ్గించాలని పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
 
 దీనివల్ల మహావితరణ్‌పై రూ.7,099 కోట్ల భారం పడనుంది. ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రివర్గం పేర్కొంది. అయితే ముంబై నగరంలో టాటా పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా విద్యుత్ పొందుతున్న ముంబైవాసులకు ఈ నిర్ణయం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని సర్కారు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 21.4 మిలియన్ల వినియోగదారులకు మహావితరణ్ విద్యుత్‌ను పంపిణీ చేస్తోంది. అందులో గృహవినియోగదారులు 14.3 మిలియన్లు కాగా, వ్యవసాయదారులు 3.7 మిలియన్లు, వాణిజ్యసంబంధమైనవి 1.47 మిలియన్లు, 12 వేల హైటెన్షన్ వినియోగదారులతో సహా 3.7 లక్షల పరిశ్రమలు ఉన్నాయి. వీటి అవసరాలకు ప్రతి నెలా 1 ఎం.డబ్ల్యూ విద్యుత్ అవసరమవుతోంది. ప్రస్తుతం పరిశ్రమలకు మహావితరణ్ యూనిట్‌కు రూ.8.32 వసూలు చేస్తుండగా, 20 శాతం సబ్సిడీ (87 పైసలు) తగ్గించి రూ.7.45 పైసలే వసూలు చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయదారులకు ఏడాదికి రూ.10,500 కోట్లు, మరమగ్గాలకు రూ.1,100 కోట్లు సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
 
 ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ మంత్రి నారాయణ రాణే నేతృత్వంలో ఏర్పడిన కమిటీ నివేదిక ప్రకారం విద్యుత్ టారిఫ్ తగ్గింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందిన అనంతరం మహావితరణ్ మిగిలిన చర్యలు తీసుకుంటుంది..’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పృథ్వీరాజ్ సర్కార్‌పై స్థానికుల నుంచి విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం వినతులు వెల్లువెత్తాయి. దాంతో మహారాష్ట్ర సర్కారు విద్యుత్ టారిఫ్ తగ్గింపునకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే మహావితరణ్ వసూలు చేస్తున్న విద్యుత్ టారిఫ్ 20 నుంచి 50 శాతం ఎక్కువగా ఉందని ఇప్పటికే వివిధ పారిశ్రామిక వర్గాలు వాదిస్తున్నాయి.  కాగా, నగరంలో విద్యుత్ టారిఫ్‌ను తగ్గించాలని ఆర్-ఇన్‌ఫ్రా విద్యుత్ పంపిణీ కంపెనీకి వ్యతిరేకంగా ఈ నెలారంభంలో ముంబైకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సంజయ్ నిరుపమ్, ప్రియాదత్ ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. టారిఫ్ తగ్గించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌కు నిరుపమ్ లేఖ కూడా రాశారు. అలాగే కేంద్ర మంత్రి మిలింద్ దేవరా సైతం విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం ఆదివారం డిమాండ్ చేసిన విషయం విదితమే.
 
 విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రైవేట్ సెక్టార్‌లకే లాభం: బీజేపీ
 విద్యుత్ టారిఫ్‌ను 20 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల ప్రైవేట్ కంపెనీలకే తప్ప వినియోగదారులకు ఎటువంటి ఉపయోగం ఉండదని బీజేపీ విమర్శించింది.‘ప్రభుత్వ నిర్ణయం ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే వారే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఖర్చులు భరిస్తారు కాబట్టి..’ అంటూ అసెంబ్లీలో విపక్ష నేత వినోద్ తావ్డే ఆరోపించారు.

మరిన్ని వార్తలు