ఇమిగ్రేషన్‌ అధికారులకు మొయిన్‌ ఝలక్‌!

16 Oct, 2016 13:17 IST|Sakshi
ఇమిగ్రేషన్‌ అధికారులకు మొయిన్‌ ఝలక్‌!

న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్‌ కేసులో తనను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్‌ అధికారులకు మాంసపు ఎగుమతి వ్యాపారి మొయిన్‌ ఖురేషీ ఝలక్‌ ఇచ్చాడు. ఆదాయ పన్ను కేసులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూపించి దుబాయ్‌కు చెక్కేశాడు. పొరపాటును గుర్తించిన అధికారులు కంగు తిని, విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగింది. మనీల్యాండరింగ్‌ కేసులో ఖురేషీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ‘లుక్‌ అవుట్‌ సర్కు్యలర్‌’(ఎల్‌వోసీ) జారీ చేసిన నేపథ్యంలో అతన్ని  విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధించారు.

అతను తాను విదేశాలకు వెళ్లడంపై ఆంక్షలు లేవంటూ జారీ చేసిన ఓ కోర్టు ఉత్తర్వును వారికి చూపారు. దీంతో అతడిని దుబాయ్‌కు వెళ్లేందుకు ఇమిగ్రేషన్‌ అధికారి అనుమతించారు. కాసేపయ్యాక  ఈడీ బృందం అతన్ని తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కోర్టు ఉత్తర్వు ఆధారంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన విషయాన్ని ఇమిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వును మరోసారి పరిశీలించగా.. అది ఆదాయ పన్ను కేసులో జారీ చేసిందని, ఈడీ కేసులో జారీ చేసింది కాదని గుర్తించారు.

మరిన్ని వార్తలు