విదర్భకు వడగళ్ల ఉరి

24 Mar, 2014 23:06 IST|Sakshi

 యవత్మాల్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లు విదర్భప్రాంత రైతుల ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఐదు రోజుల్లోనే 17 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ఫిబ్రవరి 25 వ తేదీన రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాలు, వరదలతో అతలాకుతలమైన విదర్భ ప్రాంతంలో ఇప్పటివరకు 36 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విదర్భ జన్ ఆందోళన్ సమితి అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు కిషోర్ తివారి మాట్లాడుతూపంటల నష్టంతో మనస్తాపానికి గురై  గత ఐదు రోజుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన 17 మంది రైతుల గృహాలను సందర్శించి, కుటుంబాలను పరామర్శించామన్నారు. అకాల వర్షాల ముంపుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నారు. పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.4,000 చొప్పున గత వారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించినా, వాస్తవ పరిస్థితుల్లో పూర్తి నివేదికలు ఇంకా తయారు కాలేదని ఆయన విమర్శించారు. అధికారులు సార్వత్రిక ఎన్నికల పనుల్లో బిజీగా ఉండటంతో పంటనష్టపోయిన రైతుల వివరాలను పూర్తిగా సేకరించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

 సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే రైతులకు ఈ ఆర్థికసాయం అందుతుందని స్థానిక అధికారులు చెబుతున్నారన్నారు. ఇదిలా ఉండగా అకాల వర్షాల కారణంగా 50 శాతానికిపైగా పంట నష్టపోయిన రైతులకే సర్కారు ఆర్థికసాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు.  వడగండ్ల వానవల్ల రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో 19 లక్షలకుపైగా హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, రబీ గోధుమ, జొన్న, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. అలాగే మామిడి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ చెట్లు నేలకూలాయి.

మరిన్ని వార్తలు