తమిళ సంఘాలపై రజనీ అభిమానుల ఆగ్రహం

23 May, 2017 23:45 IST|Sakshi
తమిళ సంఘాలపై రజనీ అభిమానుల ఆగ్రహం

చెన్నై: తమ రాష్ట్రానికి చెందని సినీనటుడు రజనీకాంత్‌ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వీలు లేదంటూ కొన్ని స్థానిక సంఘాలు నిరసన చేయడంపై ఆయన అభిమానులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా చెన్నైలో మంగళవారం ఆందోళనకారులు దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

రజనీ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకునే వారికి వ్యతిరేకంగా బొమ్మ తగులబెట్టేందుకు ప్రయత్నించామని, ఏ ఒక్కరూ తమ లక్ష్యం కాదని ఆందోళనకు నేతృత్వం వహించిన రజనీ అభిమాని సత్య అన్నారు. కన్నడిగుడు అయిన రజనీ తమిళనాడు రాజకీయాల్లోకి రాకూడదనే డిమాండ్‌తో తమిళర్‌ మున్నెట్ర పడాయి సోమవారం ఆయన నివాసం ఎదుట ఆందోళన చేయడం తెలిసిందే. మరికొన్ని తమిళ సంఘాలు కూడా సూపర్‌స్టార్‌ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకించాయి. అయితే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని ఒక గ్రామం తన సొంతూరు అని రజనీ గతవారం ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు