విద్యుత్‌కు రూ.32 వేల కోట్లు

2 Jun, 2014 00:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మరో నాలుగు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రూ.32 వేల కోట్లతో అంచనా వ్యయం రూపొందించారు. త్వరలో అధికారిక ప్రకటనతో ఈ పనులు ఆరంభం కానున్నాయి. రాష్ట్రంలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన కోతల రహిత నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమయ్యేనా? అన్న ప్రశ్న బయలుదేరింది.  రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగా ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మూడు కొత్త ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఆరంభం అయింది. థర్మల్ విద్యుత్ ద్వారా ఫలాలు దక్కుతుంటే, వర్షాభావ పరిస్థితులతో జలవిద్యుత్ నిరాశ పరిచింది. పవన విద్యుత్ గాలుల ప్రభావం మేరకు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాల మీద దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రంతో కలసి ఉడన్‌కుడిలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పే పనిలో పడింది. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఇక్కడ రెండు యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. మరికొన్ని నెలల్లో ఈ కేంద్రాల నుంచి ఫలాలు దక్కనున్నాయి.
 
 కొత్త ప్రాజెక్టులు: ఉడన్ కుడి పనులు ముగిసిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రాజెక్టులకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో ఐదు వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నది. రూ.32 వేల కోట్లు ఇందుకు అంచనాగా రూపొందించారు. ఉత్తర చెన్నైలో రెండు యూనిట్లతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి 660 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనున్నది. రామనాథపురం ఉప్పడంలో 800 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఓ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, తూత్తుకుడిలో వెయ్యి మెగావాట్ల లక్ష్యంగా రెండు ప్రాజెక్టులకు కసరత్తు చేస్తున్నారు. మరో ప్రాజెక్టుకు సైతం చర్యలు తీసుకున్నారని, అయితే, అది ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిమీద స్థల పరిశీలనలో నిమగ్నమయ్యారంటూ విద్యుత్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.  
 
 నిరంతర విద్యుత్ సాధ్యమా?: రాష్ట్రంలో కోతల రహితంగా నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఆదివారం నుంచి ఎలాంటి కోతలు, ఆంక్షలు లేకుండా విద్యుత్ సరఫరా చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అయింది. రాష్ట్రంలో కోటి 41 లక్షల 42 వేల ఇంటి కనెక్షన్లు, 19 లక్షల 11 వేల వ్యవసాయ పంప్ సెట్,  26 లక్షల 32 వేల వాణిజ్య సంస్థలకు, ఐదు లక్షల తొమ్మిది వేల పరిశ్రమలకు కనెక్షన్లు, 20 లక్షల ఎనిమిది వేల అదనపు కనెక్షన్లు ఉన్నాయి. ఈ వినియోగ దారులకు ఒక రోజుకు 12,500 మెగావాట్లు విద్యుత్ అవసరం. అరుుతే విద్యుత్ ఉత్పత్తితో పనిలేదని, ఇక నిరంతర విద్యుత్ తమ లక్ష్యం అంటూ గత నెల సీఎం జయలలిత ప్రకటించారు. జూన్ ఒకటో తేదీ నుంచి విద్యుత్ కోతలకు మంగళం పాడుతున్నామని, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అమల్లో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తి వేస్తున్నామని జయలలిత స్పష్టం చేశారు. ఆ మేరకు ఆదివారం నుంచి అన్ని రకాల ఆంక్షలు రద్దు అయ్యాయి. తొలి రోజు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఇదే, సరఫరా మిగిలిన అన్ని రోజులు చేయగలరా? అన్న ప్రశ్న ప్రజల్లో బయలు దేరింది. సీఎం జయలలిత ఒత్తిడి మేరకు అధికారులు చేయగలమని భరోసా ఇస్తున్నా, విద్యుత్ కేంద్రాల్లో ఏదేని సాంకేతిక సమస్యలు తలెత్తిన పక్షంలో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు