చిన్నమ్మకు మోక్షం!

13 Feb, 2019 12:09 IST|Sakshi

ఏడాది ముందే శశికళ విడుదల?

కర్ణాటక జైళ్లశాఖ చట్టంలో అవకాశం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు ముందుగానే జైలు జీవితం నుంచి మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక జైళ్లశాఖ చట్టాన్ని అనుసరించి ఏడాది ముందుగానే ఆమె విడుదల ఖాయమని అంచనావేస్తున్నారు. అన్నాడీఎంకే 1991–96 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లుగా డీఎంకే హయాంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై 18 ఏళ్లపాటు వాదోపవాదాలు సాగగా 2014లో నలుగురికీ తలా నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. అంతేగాక జయలలిత రూ.100 కోట్లు, మిగతా ముగ్గురు తలా రూ.10 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్చు చెప్పింది. ఈ తీర్పుపై నలుగురు సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లినా అదే శిక్షను ఖరారు చేస్తూ 2017 ఫిబ్రవరి 14వ తేదీన తీర్పువెలువడింది. అయితే అప్పటికే జయలలిత కన్నుమూయగా మిగిలిన ముగ్గురు బెంగళూరు పరప్పన అగ్రహారంలోని జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు.

రెండేళ్లు పూర్తి: ఇదిలా ఉండగా ఈనెల 15వ తేదీతో వారి జైలు జీవితం రెండేళ్లు పూర్తిచేసుకుంటుంది. శిక్షను అనుభవిస్తున్నా ఈ ముగ్గురూ రూ.10 కోట్ల జరిమానా ఇంతవరకు చెల్లించలేదు. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులు జప్తు చేయాల్సిందిగా ఆనాడే కోర్టు ఆదేశించింది. అయితే రెండేళ్లు పూర్తికావస్తున్నా ఆస్తుల జప్తు జరగలేదని తెలుస్తోంది. శశికళ ఆస్తులను జప్తు చేయాలని కొన్ని నెలల క్రితం తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నించినా అది నెరవేరలేదు. ఆస్తుల జప్తు విషయంలో ఆదాయపు పన్నుశాఖ సైతం ఎందుచేతనో మౌనం పాటిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శశికళ ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్ర జైళ్లశాఖ నిబంధనల ప్రకారం...సుదీర్ఘ, స్వల్పపరిమిత కాలశిక్షకు గురైన వారు మూడోవంతు జైలుజీవితాన్ని పూర్తిచేస్తే ముందుగానే విడుదల చేయవచ్చని అంటున్నారు. ఈ చట్టాన్ని అనుసరించి శశికళ నాలుగేళ్లు పూర్తికాకుండానే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగేళ్ల జైలుశిక్ష ప్రకారం 2021 వరకు ఆమె జైల్లోనే ఉండాలి. అయితే కర్ణాటక చట్టాన్ని అనుసరించి మూడేళ్లు పూర్తికాగానే బాహ్యప్రపంచంలోకి అడుగిడవచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు