తలైవా మద్దతు!

19 Jun, 2017 03:21 IST|Sakshi
తలైవా మద్దతు!

అన్నదాతకు అండగా ముందుకు
రూ.కోటి ఇవ్వడానికి సిద్ధమని ప్రకటన
అయ్యాకన్నుకు రజనీకాంత్‌ అభినందనలు


కరువు కోరల్లో చిక్కి తల్లడిల్లుతున్న తమిళ రైతుకు మద్దతుగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ ముందడుగు వేశారు. రైతుపోరుకు మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా ముందుకు సాగాలని అన్నదాతకు సూచించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నదుల అనుసంధానానికి రూ. కోటి ఎప్పుడైనా ఎక్కడైనా ఇవ్వడానికి సిద్ధం అని స్పష్టంచేశారు. ఇక, రైతు నాయకుడు అయ్యాకన్ను బృందాన్ని తలైవా అభినందించారు.


సాక్షి, చెన్నై : వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతుల గుండె ఆగడం, బలవన్మరణాల సంఖ్య పెరగడం వెరసి అన్నదాతల్లో ఆందోళన బయలుదేరింది. తమను ఆదుకోవాలని నినదిస్తూ రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వేదికగా నెలన్నర రోజుల పాటుగా పోరాటాలు సాగించారు. ఆ సమయంలో కంటితుడుపు చర్యగా హామీలు గుప్పించిన పాలకులు, తదుపరి విస్మరించడంతో మళ్లీ రైతన్నలు పోరుబాటకు సిద్ధమయ్యారు.

దక్షిణ భారత నదుల అనుసంధాన సంఘం నేత అయ్యాకన్ను నేతృత్వంలో ఉద్యమం ఉధృతం అవుతోంది. రాష్ట్రంలో తొలి విడతగా ఆందోళనలు సాగుతున్నాయి. తదుపరి మళ్లీ ఢిల్లీ వేదికగా ఉద్యమానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో తలైవాతో రైతు బృందం భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో కథానాయకుడు అన్నదాతలతో భేటీ కావడం, వారికి మద్దతుగా ‘నేను సైతం’ అని మద్దతు ప్రకటించడం గమనార్హం.

కథానాయకుడి మద్దతు
నదుల అనుసంధానానికి రూ. కోటి ఇస్తానని గతంలో రజనీ కాంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన మేరకు అయ్యాకన్ను నేతృత్వంలో రైతు ప్రతినిధులు ఆదివారం ఉదయం పోయెస్‌ గార్డెన్‌లో అడుగు పెట్టారు. అక్కడ రజనీకాంత్‌తో భేటీకి ప్రయత్నించారు. రైతు నాయకుల రాకతో రజనీకాంత్‌ ఇంటినుంచి ఆహ్వానం లభించింది. అయ్యాకన్ను బృందంలోకి వెళ్లగానే తలైవా మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం, శాలువతో సత్కరించడం విశేషం. అరగంట పాటు సాగిన భేటీ అనంతరం మీడియాతో అయ్యాకన్ను మాట్లాడుతూ, తమ పోరాటాలకు కథానాయకుడు మద్దతు ప్రకటించినట్టు పేర్కొన్నారు.

నదుల అనుసంధానానికి రూ.కోటి ఎప్పుడు ఇస్తారని..? ప్రశ్నించేందుకు వెళ్లిన తమతో రజనీకాంత్‌ మర్యాద పూర్వకంగా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. రైతు రుణాల రద్దు, ఢిల్లీ జంతర్‌మంతర్‌ నిరసను, మళ్లీ పోరుబాట ఉధృతం గురించి వివరిస్తూ రజనీకాంత్‌కు ఓ వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. దానిని పరిశీలించి ఆయన తన మద్దతు ప్రకటించారన్నారు. శాంతియుతంగా నిరసనలు సాగాలని ఆయన సూచించినట్టు తెలిపారు. నదుల అనుసంధానానికి రూ.కోటి ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు రజనీ సూచించారన్నారు. త్వరలో ప్రధానికి అందజేయాలని తాము కోరినట్టు తెలిపారు. రైతులకు సహకారంగా ముందుకు సాగుతానని, తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని రజనీ భరోసా ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు