ఆప్తులను స్మరించుకున్న ‘ఉపహార్’ బాధితులు

13 Jun, 2014 23:02 IST|Sakshi
ఆప్తులను స్మరించుకున్న ‘ఉపహార్’ బాధితులు

న్యూఢిల్లీ: ఉపహార్ అగ్ని ప్రమాదంలో మరణించిన 59 మందిని స్మరించుకుంటూ బాధిత కుటుంబాలు శుక్రవారం ఇక్కడ ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. పదిహేడేళ్ల క్రితం ఉపహార్ సినిమా థియేటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించిన సంగతి తెల్సిందే. ఇటువంటి మానవ తప్పిదాల కారణంగా జరిగే ప్రమాదాలలో దోషులను శిక్షించేందుకు ఓ పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలని బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి.
 
ఉపహార్ హాలు ఎదురుగా ఉన్న గ్రీన్ పార్కులోని స్మృతి ఉపవన్‌లో బాధిత కుటుంబాలు హోమం నిర్వహించాయి. మానవ తప్పిదాల కారణంగా జరిగే విపత్తులపై విచారణ జరిపేందుకు ఓ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఉపహార్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షులు నీలం కృష్ణమూర్తి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జూన్ 13, 1997లో జరిగిన ఆ అగ్నిప్రమాదంలో నీలం తన ఇద్దరు పిల్లలను కోల్పోయారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 19, 2009లో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్, ఢిల్లీ అగ్ని మాపక శాఖ సిబ్బంది హెచ్‌ఎస్ పన్వర్‌లకు ఏడాది జైలు శిక్ష విధించింది.

ఆ తరువాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అగ్ని ప్రమాదానికి అన్సల్ సోదరులను దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం శిక్ష విధించే విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు.దోషులకు శిక్ష విధించే ముందు ధర్మాసనం నాటి విషాద దౌష్ట్యాన్ని పరిగణనలోకి తీసుకోగలదని కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. నేరం తీవ్రతకు తగిన విధంగా శిక్ష ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
 
అన్సల్ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం
 వ్యాపార అవసరాల కోసం లండన్, న్యూయార్క్ నగరాలను సందర్శించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సత్వరం విచారణ జరపాలన్న గోపాల్ అన్సల్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ అంశాన్ని వచ్చే వారం మరో ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తులు జేఎస్ ఖేహర్, సి.నాగప్పన్‌లు అన్సల్‌ను ఆదేశించారు.

మరిన్ని వార్తలు