భారీగా విద్యుత్ వినియోగం

13 Jun, 2014 23:02 IST|Sakshi
భారీగా విద్యుత్ వినియోగం

సాక్షి, ముంబై: ఈ వేసవిలో ముంబైకర్లు రికార్డుస్థాయిలో విద్యుత్‌ను వినియోగించారు. పగలూ రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంతో 3,365 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. గత సంవత్సరం వేసవిలో 3,212 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఇది రికార్డుస్థాయి వినియోగమని అప్పుడు అధికారులు ప్రకటించారు. ఈ రికార్డును కూడా 2014 తిరగరాసిందని విద్యుత్ సరఫరాశాఖ అధికారులు ప్రకటించారు. ఈసారి వేసవి ప్రారంభంకాకముందే ఎండలు మండిపోవడం మొదలయ్యాయి. ఏప్రిల్, మేలో పరిస్థితి దారుణంగా మారింది.
 
ఉక్కపోత భరించలేక నిరంతరం కూలర్లు, ఫ్యాన్లు, ఏసీ వినియోగించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు పడతాయని,  ఉక్కపోత నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ముంబైకర్లు భావించారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వర్షాలు ఆలస్యం కావడం, దీనికి తోడు ఉక్కపోత మరింత పెరిగిపోవడంతో అంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. దీని ఫలితంగా విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. ముంబైకి రిలయన్స్ ఇన్‌ఫ్రా, టాటా పవర్, బెస్ట్, మహావితరణ్ సంస్థలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి.
 
ఈ ఏడాది మే 10 నుంచి జూన్ 10 వరకు నాలుగు కంపెనీలు వినియోగదారులకు 3,365 మెగావాట్ల కరెంటును సరఫరా చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ విద్యుత్ వాడినట్టు వెల్లడయింది. ఇందులో అత్యధిక శాతం అంటే 1,771 మెగావాట్ల విద్యుత్ రిలయన్స్ కంపెనీ శివారు ప్రాంతాలకు సరాఫరా చేసింది. ఆ తరువాత స్థానంలో టాటా, బెస్ట్, మహావితరణ్ ఉన్నాయి. ముంబైకర్లకు విద్యుత్ సరఫరాచేసే హైటెన్షన్ వైర్లను ఇటీవల మార్చివేశారు. దీంతో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు మార్గం సుగమమయింది.

మరిన్ని వార్తలు