ఒకే వేదికపై ఆ ఇద్దరు

1 Feb, 2018 15:52 IST|Sakshi

నారాయణ, కిరణ్‌ ప్రత్యక్షం

సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఒకే వేదిక మీదకు వచ్చారు. ఇకనైనా వివాదాల్ని వీడి పుదుచ్చేరి ప్రగతికి ఈ ఇద్దరు సమిష్టిగా పనిచేస్తారన్న ఎదురుచూపులు పెరిగాయి. పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. కిరణ్‌ అడ్డుకునే విధంగా ఆమె పర్యటనల్లో ప్రజల్లో వ్యతిరేకత సాగడం ఇందుకు నిదర్శనం.

ఆరు నెలలుగా ఈ ఇద్దరి మధ్య సాగుతూ వచ్చిన సమరం, తాజాగా సమసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్‌ నిర్ణయాల్ని సీఎంవ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి. అలాగే, ప్రభుత్వ వేడుకల్లో ఈ ఇద్దరు ఒకే వేదిక మీదకు సైతం రాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం విశేషం. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇకనైనా సమసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. వేదిక మీద ఈ ఇద్దరు అందర్నీ ఆకర్షించే రీతిలో కనిపించడంతో, ఇక సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమిస్తారా లేదా, విభేదాలతో కాలం మరింతగా నెట్టుకు వస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు