జర్నలిస్టు హత్య అమానుషం

29 Nov, 2014 04:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంవీఎన్ శంకర్ (53) హత్యను ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీయూడబ్ల్యూజే), ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీఎన్‌ఈఎఫ్), ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించాయి.

రిపోర్టింగ్ పూర్తి చేసుకుని రాత్రి సమయంలో ఇంటికి చేరుకుంటుండగా ముగ్గురు ఆగంతకులు దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రికి తరలించగానే శంకర్ మృతి చెందారని యూనియన్ల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలించడంపై వార్తలు రాసినందుకే మాఫియా గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమసుందర్, ఐవీ సుబ్బారావు, ఏపీఎన్‌ఈఎఫ్ అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అమర్‌నాథ్ విమర్శించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. మృతుని కుటుంబానికి  రూ. 10 లక్షల సాయం అందించాలని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
 

మరిన్ని వార్తలు