ఆరేళ్ల నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు?

31 Jan, 2020 05:16 IST|Sakshi
సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌

ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై గిరిజన సలహా మండలిలో సభ్యుల ఆగ్రహం

2020–21 నుంచి తప్పకుండా 10% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచకపోవడంతో రాష్ట్రంలోని గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని గిరిజన సలహా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్లు రాష్ట్రంలో మాత్రం పెరగలేదని, దీంతో గిరిజనులకు అన్ని రంగాల్లో కోటా తగ్గిం దని సభ్యులు మండిపడ్డారు. గురువారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎజెండా లోని అంశాలను ప్రస్తావిస్తుండగా.. ములుగు శాసనసభ్యురాలు సీతక్క గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు.

రాష్ట్రంలో 9.8% గిరిజన జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరేళ్లు కావస్తుందని, ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచకపోవడంతో ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని పలువురు సభ్యులు ప్రశ్నించారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, అక్కడ పెండింగ్‌లో ఉందన్నారు. అనంతరం పోడు భూముల అంశం ప్రస్తావనకు రావడంతో మంత్రి జోక్యం చేసుకుంటూ దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే హామీ ఇచ్చారని, మరోసారి ఈ అంశాన్ని ఆయనకు వివరిస్తానని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.

బిల్లులు చెల్లించడం లేదు.. 
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఇప్పటికే పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోయాయని సభ్యులు ప్రస్తావించారు. 2020–21 విద్యా సంవత్సరంలో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షే మ శాఖ కార్యదర్శి బెన్‌హర్‌ మహేశ్‌ దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు