ఐదేళ్లలో 235 కాలేజీలమూత 

10 Aug, 2018 04:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గత రెండేళ్లలోనే ఎక్కువ

అయినా దేశంలో ఇప్పటికీ తెలంగాణలోనే అత్యధిక కాలేజీలు

దేశంలో సగటున ప్రతి లక్ష మందికి 28 కాలేజీలు

తెలంగాణ, కర్ణాటకలో ప్రతి లక్ష మందికి 51 కాలేజీలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 235 కాలేజీలు (అన్ని రకాలు) మూతబడ్డాయి. అందులో గత రెండేళ్లలోనే భారీగా కాలేజీలు మూతబడ్డాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయడం, మెరుగైన విద్య అందించేలా అనేక సంస్కరణలు తీసుకు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అందులోనూ చాలా వరకు కాలేజీలను యాజమా న్యాలు స్వచ్ఛందంగానే రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, కర్ణాటకలోనే అత్యధిక కాలేజీలు ఉన్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందికి 28 కాలేజీలు మాత్రమే ఉంటే.. తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రం ప్రతి లక్ష మందికి 51 కాలేజీలు ఉన్నట్లు వెల్లడించింది. అందులో 82 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలోనే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యలో మాత్రం ఐదేళ్లలో పెద్దగా పెరుగుదల నమోదు కాలేదు. ఐదేళ్లలో కేవలం 50 వేల మంది విద్యార్థులే పెరిగారు. 2013–14లో రాష్ట్రంలోని కాలేజీల్లో 14,19,307 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 14,69,484కు పెరిగింది.

పెరిగినా.. భారీగానే మూత
రాష్ట్రంలో 2013–14లో 2,280 ఉన్నత విద్య కాలేజీలు ఉంటే 2016 నాటికి వాటి సంఖ్య 2,454కు పెరిగింది. ఆ మేరకు 174 కాలేజీలు పెరిగాయి. దాని ప్రకారం 2016లో ప్రతి లక్ష మందికి 60 కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయింది. దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నాయి. సంఖ్యాపరంగా తగ్గినా ఈ రెండు రాష్ట్రాల్లోనే కాలేజీలు అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణ, కర్ణాటకలో ప్రతి లక్ష మందికి 51 కాలేజీలు ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అంత ఎక్కువ కాలేజీలు లేవు. పైగా 2013–14లో ప్రతి లక్ష మందికి 55 కాలేజీలు ఉంటే.. ఇపుడు 51కి తగ్గాయి. అంటే ప్రతి లక్ష మందికి 4 చొప్పున కాలేజీలు తగ్గిపోయాయి.

బిహార్‌లో తక్కువ కాలేజీలు
దేశంలో 18 నుంచి 23 ఏళ్ల వయసున్న ప్రతి లక్ష మందికి (డిగ్రీ, ఆపై చదువులను అందించే) కాలేజీలు సగటున 28 ఉన్నాయి. అయితే బిహార్‌లో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అక్కడ ప్రతి లక్ష మందికి కేవలం ఏడు కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత తక్కువ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, జార్ఖండ్‌ ఉన్నాయి. అక్కడ ప్రతి లక్ష మందికి 8 కాలేజీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ప్రతి లక్ష మందికి 12 కాలేజీలే ఉన్నాయి. దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న మొదటి 10 జిల్లాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో 472 కాలేజీలు ఉన్నాయి. 343 కాలేజీలతో రంగారెడ్డి 5వ స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో 2016–17లో 438 కాలేజీలు ఉంటే 2017–18 నాటికి వాటి సంఖ్య 343కు పడిపోయింది.
 

మరిన్ని వార్తలు