సెలవుల సంబరం ముగియకనే..

21 Jan, 2015 03:09 IST|Sakshi
సెలవుల సంబరం ముగియకనే..

సంక్రాంతి సెలవుల్లో బంధువుల ఇంట్లో ఉన్న తమ పిల్లలను స్వగ్రామానికి తీసుకువస్తున్నామన్న సంతోషం ఆ కుటుంబాలకు రోడ్డు ప్రమాదం మృత్యురూపంలో దూరం చేసింది. గాఢ నిద్రలో ఉన్న ఆ కుటుంబీకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. వారు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలయ్యారు. ఈ  విషాదకర సంఘటన  కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.          

* కల్వర్టును ఢీకొన్న ఓమ్ని వ్యాన్
* నలుగురి మృతి,ఐదుగురికి తీవ్రగాయాలు
* మృతులంతా ఒకే కుటుంబీకులు
* సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ


కరీంనగర్ జిల్లా గోదావరిఖని అడ్డకట్టపల్లికి చెందిన ముజీబుద్దీన్ (46), రజీయొద్దీన్ (40) అన్నదమ్ములు. వీరు గోదావరిఖనిలో స్వీట్ హోంను నిర్వహిస్తున్నారు. కాగా ముజీబుద్దీన్‌కు కుమారుడు తాలీబుద్దీన్ (18), కుమార్తెలు ముస్కాన్ (13), రాంసా, సఫోరా ఉన్నారు. రజీయొద్దీన్‌కు ఇద్దరు కుమార్తెలు సన, సుమయలు ఉన్నారు. అయితే పాఠశాల, కళాశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో పిల్లలను అందరినీ కలిపి అన్నదమ్ములు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి చేర్చారు.

అయితే సెలవులు పూర్తి కావడంతో సోమవారం ముజీబుద్దీన్, రజియొద్దీన్‌లు ఓమ్నిలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి దాటిన తరువాత పిల్లలతో సహా గోదావరిఖనికి బయలుదేరారు. ఈ క్రమంలో కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును వేగంగా ఢీ కొంది. అనంతరం పక్కనే ఉన్న గోతిలో వ్యాన్ పడింది.

ఈ సంఘటనలో వాహనాన్ని నడుపుతున్న రజీయొద్దీన్, అతడి అన్న ముజీబుద్దీన్, అన్న కుమార్తె ముస్కాన్, కుమారుడు తాలిబుద్దీన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సఫోరా, రాంసా, సుమయ, మొయినుద్దీన్, సనలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుకునూరుపల్లి ఎస్‌ఐ కృష్ణ నేతృత్వంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సుమయ, మొయినుద్దీన్‌ల పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించారు.
 
సంఘటనా స్థలాన్ని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌గౌడ్ సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. అదే విధంగా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టంలో ఉన్న మృతదేహాలను డీఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట తొగుట సీఐ వెంకటయ్య, కుకునూర్‌పల్లి ఎస్‌ఐ కృష్ణలున్నారు.

ఈ ప్రమాదంపై కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే కారణమని డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు. కాగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఇంటి విషాదం నెలకొంది. కుటుంబ యజమానులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

మరిన్ని వార్తలు