సమగ్ర సర్వేలో నమోదైన కుటుంబాలు 9.85లక్షలు

10 Sep, 2014 03:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సుమారు పక్షం రోజుల పాటు సాగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తి కావడంతో సమాచారం వెలుగు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. సర్వేలో సేకరించిన సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ విశ్లేషిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8,69,451 కుటుంబాలుండగా, ప్రస్తుత సర్వేలో 9,85,557 కుటుంబాలున్నట్లు తేలింది. మరోవైపు జిల్లా జనాభా 40,53,028 కాగా, సమగ్ర సర్వేలో 42,14,865 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
 
 జిల్లాలో అత్యధికంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, రూరల్ మండలంలో 63,758 కుటుంబాలుండగా, పెద్ద మందడి మండలంలో అత్యల్పంగా 8,866 కుటుంబాలున్నట్లు సర్వేలో తేలింది. పౌర సరఫరాల శాఖ వివిధ కేటగిరీల కింద 11,73,988 రేషన్ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం వీటిలో అదనంగా ఉన్న కార్డులను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. సమగ్ర సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్యను మించి రేషన్ కార్డులున్నట్లు మరో మారు తేటతెల్లమైంది. సమగ్ర సర్వే సందర్భంగా వివరాల నమోదు సందర్భంగా ఎన్యూమరేటర్లు కొన్నిచోట్ల ఖాళీలను వదలడంతో సమాచారాన్ని పోల్చి చూడడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం.
 
కులాల వారీగా సమాచారం, ఫోన్లు, బ్యాంకు అకౌంట్లున్న వారు, వికలాంగుల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యమున్న కుటుంబాల సంఖ్య భవిష్యత్ ప్రణాళికల్లో కీలకమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి కలిగి ఉన్న కుటుంబాలు, సొంత వాహనాలు, పశు సంపద తదితర వివరాలు ఇతర జిల్లాల్లో కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం వుంది. రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన సర్వే వివరాలు అప్‌లోడ్ చేసిన తర్వాత సమగ్ర సర్వే సమాచారాన్ని అధికారికంగా వెల్లడించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు