‘రైతు సమన్వయం’పై ఆచితూచి అడుగులు!

26 Sep, 2017 02:01 IST|Sakshi

2 దశల్లో వడబోత, నిఘావర్గాల ద్వారా సమాచారం సేకరణ     

మందకొడిగా జిల్లా సమితుల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: రైతు సమన్వయ సమితులపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రామ, మండల స్థాయి సమితుల నియామకం పూర్తి కావడంతో జిల్లా సమితులపై దృష్టి పెట్టింది. జిల్లా సమితుల్లో సభ్యులుగా తీసుకుంటున్న వారి విషయంలో ఒకటికి, రెండు సార్లు వడబోత చేపట్టనున్నారని సమాచారం. దీనికోసం ప్రభుత్వ నిఘా వర్గాలు పూర్తి వివరాలు సేకరిస్తున్నాయని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫలితంగా జిల్లా స్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది. అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు 12 జిల్లా సమితులు మాత్రమే పూర్తయ్యాయి. అన్ని కమిటీల ఏర్పాటు పూర్తయ్యాక డిసెంబర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు కసరత్తు సాగుతోందని తెలిసింది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రభుత్వం రైతాంగానికి సాగుబడి ఖర్చుల కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.8 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకం పక్కదారి పట్టకుండా, అర్హులైన వారికే పథకం చేరేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పథకాన్ని ఆరంభించడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళనకు నడుం కట్టింది.

భూ రికార్డుల ప్రక్షాళనలో మొదట ఈ రైతు సమన్వయ సమితులకూ భాగస్వామ్యం ఉంటుందని భావించినా, ఇప్పటివరకు రెవెన్యూ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలు, సమాచారం ఉండే రైతు సమితుల ద్వారానే వివాదాల్లేకుండా వ్యవహారాలు నడిపించవచ్చన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ కారణంగానే సభ్యులుగా తీసుకునే వారి గురించి పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారని సమాచారం.

పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు ప్రభుత్వం విధివిధానాలను తెలియజేస్తూ జారీ చేసిన జీవో 39పై విపక్షాల నుంచి విమర్శలు, వ్యతిరేకత వచ్చినా, రిజర్వేషన్‌ విధానాన్ని పాటిస్తూనే సభ్యులను ఎంపిక చేస్తున్నారు. ప్రధానంగా వీటి ద్వారా గ్రామ స్థాయి నుంచి అధికార పార్టీ శ్రేణుల్లో అత్యధికుల రాజకీయ నిరుద్యోగం తీరినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా సమితి సభ్యుల ఎంపిక బాధ్యతను మంత్రులు తీసుకున్నారు.

వీరు తయారు చేసిన జాబితాలను వడబోస్తున్నారని తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వ నిఘా వర్గాల సహకారం తీసుకుంటున్నారు. ఈ కారణంగానే సమితుల ఏర్పాటు కొంత ఆలస్యమవుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ల ఎంపికపై దృష్టి పెట్టారని, ఇవన్నీ ఒకే దఫా పూర్తయ్యే అవకాశ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు