సురేశ్‌.. ఎమ్మార్వో ఆఫీసుకు ఎందుకెళ్లాడు?

4 Nov, 2019 20:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి హత్యకు భూ వివాదమే కారణమని కూర సురేశ్‌ ముదిరాజ్‌ పెదనాన్న దుర్గయ్య తెలిపారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ తమ భూమిని ప్రత్యర్థులకు తహశీల్దార్‌ విజయారెడ్డి బదలాయించినట్టు ఆరోపించారు. బచారంలో సర్వే నంబరు 90 నుండి 102 వరకు ఉన్న మొత్తం 110 ఎకరాల భూమిపై హైకోర్టు, కలెక్టరేట్‌లోనూ కేసులు నడుస్తున్నాయన్నారు. తమకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. ఈ విషయాలు ఎప్పుడు సురేశ్‌తో చర్చించలేదన్నారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా ఉండదని, ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అస్సలు ఊహించలేదని దుర్గయ్య వాపోయారు.

తమకు ఎటువంటి భూ వివాదాలు లేవని, తన కొడుకు ఎప్పుడు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లలేదని సురేశ్‌ తల్లి పద్మ అన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఇంట్లోనే వున్నాడని, తండ్రి కృష్ణతో కలిసి ఉదయం కట్టెలు కొట్టాడని చెప్పారు. ‘మధ్యాహ్నం భోజనానికి రాకపోయేసరికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్‌ వచ్చింది. ఎమ్మార్వోపై దాడి చేశాడని కొద్దిసేపటికి తెలిసింది. భూములకు సంబంధించిన విషయాలను నా భర్తే చూసుకుంటాడు. సురేశ్‌ ఎమ్మార్వో కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో తెలియద’ని ఆమె వివరించారు. కాగా, తహశీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో దుర్గయ్య పైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

మంత్రి గంగుల ఘెరావ్‌
తహశీల్దార్ విజయారెడ్డిపై దాడి చేసి సజీవ దహనం చేయడంపై కరీంనగర్‌లో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. క్యాండిల్ ర్యాలీతో విజయారెడ్డికి నివాళులర్పించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్యోగులు ఘెరావ్ చేయడంతో వారిపై మంత్రి అసహనం ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

తహశీల్దార్‌ సజీవ దహనం; పాపం పిల్లలు

తహశీల్దార్‌ సజీవ దహనం; అసలేం జరిగింది?

అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన; మరో ఇద్దరికి సీరియస్‌

తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండగుడు

మరిన్ని వార్తలు