సిటీ బస్‌స్టాపుల్లో ఏసీ, కాఫీ మిషన్లు..

22 May, 2018 15:58 IST|Sakshi
సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న సిటీ బస్‌స్టాపు

అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్‌ ‘షెల్టర్లు’

అందుబాటులోకి రానున్న 826 ఏసీ బస్‌షెల్టర్లు  

సాక్షి, హైదరాబాద్‌ : ఎయిర్‌కండీషనింగ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, ఏటీఎం, కాఫీ మిషన్లు, వైఫై, సీసీ టీవీ, టాయిలెట్లు ఇవన్నీ ఇప్పటిదాక మనం ఎయిర్‌పోర్టులో లేదా మెట్రో స్టేషన్లలోనే చూసేవాళ్లం. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ బస్‌స్టాపుల్లో కూడా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో బస్‌స్టాపులను(బస్‌షెల్టర్లను) ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్‌ చార్జింగ్, టాయిలెట్లు ఉండేలా ఆధునిక బస్‌షెల్టర్‌లను ఏర్పాటు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్‌షెల్టర్‌ను శిల్పారామం వద్ద రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ఆర్‌టీఏ ఆఫీసు దగ్గర, కూకట్‌పల్లికి దగ్గరిలో కేపీహెచ్‌బీ వద్ద మరో రెండు ఆధునిక లేదా గ్రేడ్‌ 1 బస్‌షెల్టర్లు తుది దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 826 ఆధునిక బస్‌షెల్టర్లను నాలుగు ప్యాకేజీలలో జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. వీటిలో మొదటి గ్రేడ్‌లో అడ్వాన్స్‌డ్‌  ఏసీ బస్‌షెల్టర్లను నిర్మిస్తున్నారు. కేవలం పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్‌షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్‌-2 బస్‌షెల్టర్లలో డస్ట్‌బిన్‌లు, టాయిలెట్లు, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు, తాగునీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

గ్రేడ్‌-3 బస్‌షెల్టర్‌లో డస్ట్‌బిన్, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం ఉండనుంది. గ్రేడ్‌-4లో కేవలం బస్‌షెల్టర్‌తో పాటు డస్ట్‌బిన్‌లే ఉంటాయి. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా 826 బస్‌షెల్టర్లను విభజించి టెండర్‌ ద్వారా వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. అత్యాధునిక బస్‌షెల్టర్లతో ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో మాదిరిగా నగరవాసులకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు