కౌమారానికి.. కౌన్సెలింగ్‌..

2 Dec, 2018 05:19 IST|Sakshi

కౌమార దశ.. పిల్లలు పెద్దలయ్యే దశ. అప్పటివరకు అమ్మచాటు బిడ్డలా ఎదిగిన వారు, ఒక్కసారిగా ఏవో తేలియని ఉద్వేగాలకు లోనవుతారు. ఈ దశలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులొస్తాయి. పిల్లల ఎదుగుదలకు ఇది అత్యం త కీలక దశ. ఇలాంటి సమయంలో వారి అవసరాలు తీర్చగలిగితే, వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు, సరైన కౌన్సెలింగ్‌ ఇవ్వగలిగితే మెరుగైన ఫలితాలొస్తాయని ‘సంగత్‌’అనే ఎన్జీవో చేపట్టిన ‘సెహర్‌’(స్ట్రెంగ్తనింగ్‌ ది ఇవినెడ్స్‌ బేస్‌ ఆన్‌ ఎఫెక్టివ్‌ స్కూల్‌ బేస్డ్‌ ఇంటర్వెన్షన్స్‌ ఫర్‌ అడాల్సెంట్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌) ప్రాజెక్టు తెలియజేస్తోంది. బిహార్‌లోని నలంద జిల్లాలో 74 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టు అమలు చేశారు. దీని ఫలితాలపై ‘లాన్సెట్‌’పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించింది.  

ప్రాజెక్ట్‌ అమలు ఇలా..
ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన కౌన్సెలర్లు (సెహర్‌ మిత్రలు) ఫిర్యాదులు, సూచనలు తీసుకునేందుకు పెట్టెలు ఏర్పాటు చేయడం, విజ్ఞానం కోసం నెలనెలా గోడపత్రిక తీసుకురావడం, ఉద్వేగ–ప్రవర్తనా పరమైన అంశాల్లో.. సామాజిక–ఆహార–విద్యా సంబంధిత విషయాల్లో టీనేజర్ల ఇబ్బందులు తొలగించేందుకు వ్యక్తిగతంగా కౌన్సెలింగ్‌ ఇవ్వడం వంటి కొన్ని చర్యలు చేపట్టారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయని చెబుతున్నారు ‘సెహర్‌’ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ప్రాచీ ఖండేపార్కర్‌.
పాఠశాలల్లో వేధింపులు–హింసాత్మక చర్యలు తగ్గడం, డిప్రెషన్‌ లక్షణాలున్న వారిలో అవి తగ్గుముఖం పట్టడం, అమ్మాయిలను చిన్నచూపు చూసే ధోరణిలో కొంతమేర మార్పు రావడం, పునరుత్పత్తి–లైంగిక ఆరోగ్యంపై అవగాహన ఏర్పడటం వంటి సత్ఫలితాలను తాము గమనించామని ఆమె తెలిపారు. పర్యవసానంగా స్కూలుకు రావడానికి పిల్లలు మరింత ఆసక్తి చూపారని ప్రాచీ వివరించారు.

ఖర్చూ తక్కువే
ప్రాజెక్టులో స్థానికులను భాగం చేస్తే మంచి ఫలితాలొస్తాయని, గ్రామాల్లోని పిల్లలు వారికి మరింత దగ్గరవుతారని భావించిన ప్రాజెక్టు నిర్వాహకులు.. కౌన్సెలింగ్‌ నిర్వహణపై ఆయా ప్రాంతాల యువతీయువకులకు శిక్షణనిచ్చారు. వారితో పాటు కొంతమంది సుశిక్షితులైన కౌన్సెలర్లు కూడా పాల్గొన్నారు. చదువుకోవాలనే ఆసక్తి లేకపోవడమనేది విద్యార్థుల నుంచి సర్వసాధారణంగా వచ్చే ఫిర్యాదు. సహ విద్యార్థులకు దగ్గర కాలేకపోవడమనేది మరో సమస్య. ఇలాంటి వాటికి మూల కారణాలేంటో వాళ్ల నుంచి తెలుసుకొని పలు కేసులు పరిష్కరించగలిగామని స్థానిక కౌన్సెలర్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. మంచి ఫలితాలు ఇవ్వగల ఇలాంటి ప్రాజెక్టు అమలుకు అయ్యే ఖర్చు తక్కువేనని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రతి ఐదుగురిలో ఒకరు కౌమర దశలో..
దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు కౌమార దశలో ఉన్నవారే. కీలకమైన ఈ దశలో వారి వికాసానికి తోడ్పడేందుకు ప్రభుత్వాలు తగిన కార్యక్రమాలు చేపట్టా ల్సివుంది. 2014లో కేంద్రం తీసుకొచ్చిన ‘రాష్ట్రీయ కిశోర స్వాస్థ్య కార్యక్రమం’ఇందుకు ఉద్దేశించిందే. ఇలాంటి వాటిని సక్ర మంగా అమలు చేసినట్టయితే ‘నలంద’తరహా అనుకూల ఫలితాలను ప్రతిచోటా మనం గమనించవచ్చు.

యుక్తవయసు వారికి సరైన కౌన్సెలింగ్‌ ఇస్తే వారి భవిష్యత్‌ను సరైన దిశలో మళ్లించిన వాళ్లమవుతాం అంటోంది ‘సంగత్‌’ అనే ఎన్జీవో.

మరిన్ని వార్తలు