బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకై ఉద్యమించాలి

19 May, 2019 03:35 IST|Sakshi

ఏపీ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీలకు ఆర్‌.కృష్ణయ్య పిలుపు

హైదరాబాద్‌: బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని పార్టీలకతీతంగా బీసీలందరూ పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఆంధ్రపదేశ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీల సమావేశం ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకానమ్మ అధ్యక్షతన జరిగింది. ఆర్‌.కృష్ణ య్య మాట్లాడుతూ.. 71 ఏళ్ల స్వతంత్ర భార తంలో పాలకులు బీసీలను అభివృద్ధి చేయకుండా గొర్రెలు, బర్రెలు ఇచ్చి, అడుక్కుతినే బిక్షగాళ్లను చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలోగానీ ఇప్పటివరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీలేడని ఆవేదన వ్యక్తం చేశా రు.

545 మంది లోక్‌సభ సభ్యుల్లో 96 మంది మాత్రమే బీసీలు ఉన్నారని, తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు కేవలం 22 మందే ఉన్నారన్నారు. తెలంగాణలో 112 బీసీ కులాలు ఉండగా ఇంతవరకు 104 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, జి.శ్రీనివాసులు, రమ్యశ్రీ (సినీ నటీ) తదితరులు పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా, బద్వేల్‌కు చెందిన జి.శ్రీనివాసులుకు నియమాక పత్రాన్ని ఆర్‌.కృష్ణయ్య అందజేశారు. తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా అల్లి లక్ష్మి, సభ్యులుగా సుమన్‌బాబు, దేవి మంజిరాలను ఎన్నుకుంది.  

మరిన్ని వార్తలు