తొమ్మిది నెలలుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్‌

9 Apr, 2017 16:27 IST|Sakshi

కుమారుడి జాడ తెలియక మనోవేదనతో తండ్రి మృతి

నెక్కొండ(నర్సంపేట): ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తాను.. అని చెప్పి వెళ్లిన కుమారుడు తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి మృతి చెందాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన బండారి వెంకన్న(56)కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమా రుడు రాజు ఉన్నారు. రాజు మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ఆ తర్వాత ఏడాది న్నరకు మండలంలోని అలంకానిపేటకి చెందిన రవళితో ఆయన వివాహం జరిగింది. ఈ క్రమంలో రాజు ఉద్యోగం చేస్తూ తొమ్మిది నెలల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు.

అప్పట్లో రాజుకు భార్యతో గొడవ జరగగా పెద్దమనుషులు చర్చలు జరిపి రాజీ కుదిర్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన ఉద్యోగానికి అని చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో రాజు బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని రాజస్తాన్‌లోని ఇసార్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, 9 నెలల క్రితం వెళ్లిన రాజు నుంచి ఎలాంటి క్షేమ సమాచారం తెలియలేదు. దీంతో రాజు తండ్రి వెంకన్న నెక్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  పోలీసులు ఆచూకీ కోసం ఆర్మీ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీయగా అసలు రాజు విధుల్లో చేరలేదని తేలింది.  మనస్తాపానికి గురైన రాజు తండ్రి వెంకన్న శనివారం మృతి చెందాడు.  ఆయన కుమార్తె లలిత తండ్రికి తలకొరివి పెట్టింది.

మరిన్ని వార్తలు