10 నుంచి ప్రభుత్వ వైద్యుల సమ్మె | Sakshi
Sakshi News home page

10 నుంచి ప్రభుత్వ వైద్యుల సమ్మె

Published Sun, Apr 9 2017 2:48 AM

Government doctors' strike from 10th

ఎమర్జెన్సీ ఆపరేషన్లూ నిలిపేస్తామని హెచ్చరిక

హైదరాబాద్‌: దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వ వైద్యులు సమ్మె సైరన్‌ మోగించారు. గత నెల 23న సమ్మె నోటీసు అందజేసిన వైద్యులు ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ వైద్యభవన్‌లో సమ్మెపోస్టర్‌ను టీజీడీఏ  ఉమెన్స్‌ వింగ్‌ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పల్లం  ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బొంగు రమేశ్, కోశాధికారి లాలూప్రసాద్‌ రాథోడ్‌లు విలేకరులతో మాట్లాడారు.

ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఇతర‡ జిల్లా ఆస్పత్రులకు డైరెక్టర్లను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రిమ్స్‌ మెడికల్‌ కళాశాలల స్వయం ప్రతిపత్తి రద్దు చేసి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలుగా ఉత్తర్వులు జారీ చేయాలని, 171 ఆంధ్రా(డీఎంఈ) డాక్టర్‌లను, డీహెచ్, ఈఎస్‌ఐలకు కేటాయించిన ఆంధ్రావైద్యులను ఏపీకి పంపించాలని అన్నారు.

ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కేంద్రంతో సంప్రదించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని, జీవో నంబర్‌ 14 ప్రకారం యూనివర్సిటీ ప్రొఫెసర్ల మాదిరిగా యూజీసీ వేతనాలను డీఎంఈ డాక్టర్‌లకు కూడా వర్తింపచేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, మందుల కొరత, నాసిరకం మందుల సమస్యలపై సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. మే 1 నుంచి 15వ తేదీ వరకు గంటపాటు నిరసనలు, మే 16 నుంచి జూన్‌ 1 వరకు అన్ని ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2వ తేదీ నుంచి దశలవారీగా ఎమర్జెన్సీ ఆపరేషన్లతోపాటు అన్ని వైద్య సేవలు స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీడీఏ  నాయకులు డాక్టర్‌ నరహరి, డాక్టర్‌ సుధాకర్, డాక్టర్‌ నాగార్జున, డాక్టర్‌ రాజు, ఉమెన్స్‌ వింగ్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అన్నపూర్ణ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement