‘సాగర్‌ దుర్గంధం భరించలేకున్నాం’

6 Oct, 2018 03:02 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డుపై వెళుతూ కారు అద్దాలు మూసుకున్నప్పటికీ హుస్సేన్‌సాగర్‌ నుంచి వచ్చే దుర్వాసన భరించలేనిదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మురికినీరు శుద్ధికి ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రాలు కొన్ని చోట్ల పనిచేస్తున్నట్లు కనిపించడం లేదంది. గతంలో చెరువుల్లో నీరు ఎంత పరిశుభ్రంగా ఉండేదో ఆ స్థితికి చెరువులను తీసుకొచ్చినప్పుడే వాటిని పరిరక్షించినట్లని తెలిపింది. జంట నగరాల్లో చెరువుల శుద్ధికి జియో ట్యూబ్‌ టెక్నాలజీని ఉపయోగించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం  మరోసారి విచారించింది. 

మరిన్ని వార్తలు