చెర్లపల్లిలో బెబ్బులి సంచారం

15 Oct, 2019 08:23 IST|Sakshi

సాక్షి, బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామ శివారు ప్రాంతంలో సోమవారం పులి సంచారం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న ఒడ్నాలమ్మ చెరువు సమీపంలో ఉదయం కొంతమంది యువకులు చేపల వేటకు వెళ్లారు. చెరువు కాలువ వద్ద గాలం వేసి చేపలు పట్టే క్రమంలో అలికిడి రావడంతో యువకులు దూరంగా ఉన్న చెట్ల పొదల వైపు తొంగిచూశారు. అంతలోనే పులి కనిపించడంతో పెద్దగా కేకలు వేస్తూ ప్రాణ భయంతో ఇళ్ల వైపు పరుగులు తీశారు. యువకుల అరుపులకు పులి సైతం గాండ్రిస్తూ పరుగులు పెట్టింది.

చెరువు సమీపంలో ఉన్న గుట్టవైపున్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు, యువకులు చెట్ల వైపు వెళ్లగా అప్పటికే పులి బెల్లంపల్లి – వెంకటాపూర్‌ బీటీ రోడ్డు దాటి మళ్లీ అచ్చులాపూర్‌ అడవులోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన బెల్లంపల్లి అటవీరేంజ్‌ అధికారి మజారొద్దిన్‌ ఇతర సిబ్బందిని వెంటేసుకుని పులి సంచరించిన ప్రాంతాన్నీ నిశితంగా పరిశీలించారు. సదరు యువకులు చెప్పిన ప్రకారంగా ఆ ప్రాంతాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి, అచ్చులాపూర్‌ అడవిలోకి వెళ్లిపోయారు. అటవీ శాఖ అధికారులకు పులి అడుగులు దర్శనమిచ్చాయి. వీటిని అధికారులు సేకరించి ఉన్నతాధికారులకు పంపారు. ఎన్నడూ లేని విధంగా పులి సంచారం జరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్రంగా భీతిల్లుతున్నారు.  

సరిగ్గా వారం రోజుల క్రితం.. 
తాండూర్‌ మండలం అచ్చులాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధి కొమ్ము గూడెం శివారులో సరిగ్గా పులి సంచరించిన పాదముద్రలు వెలుగు చూశాయి. పశువుల కాపర్లు ఆ అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు తెలియ జేయడంతో పులి సంచారిస్తున్న విషయం తెలిసింది. ఆ సంఘటన ఇంకా మరవక ముందే తాజాగా బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపుతుంది. 

సీసీ కెమెరాల ఏర్పాటుకు యత్నాలు
పులి సంచారం జరుగుతుండటంతో సత్వరంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు చెబు తున్నారు. సంచరిస్తున్న పులి ఆధారంగా రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కదలికలను కనిపెట్టడానికి కెమెరాలను అటవీ ప్రాంతంలో బిగిస్తామని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. అటవీ శివారు ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు