ఎదురుచూపులే !

22 Mar, 2018 08:48 IST|Sakshi

రైళ్ల పొడిగింపునకు అవకాశమున్నా.. నిర్లక్ష్యమే

తిరుపతికి రైలు కోసం పలుమార్లు ప్రతిపాదనలు

మణుగూరు–ఖమ్మం ప్యాసింజర్‌ కావాలంటున్న జిల్లావాసులు

హైదరాబాద్‌–కొత్తగూడెం ఇంటర్‌సిటీ ప్రతిపాదనలతోనే సరి

జిల్లా నుంచి రైల్వేకు ఏటా రూ.700 కోట్ల ఆదాయం  

సాక్షి, కొత్తగూడెం : సింగరేణి గనులు భారీగా విస్తరించి ఉన్న భద్రాద్రి జిల్లా నుంచి బొగ్గు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే రోజూ రూ.2 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఏడాదికి రూ.700 కోట్లకు పైమాటే. అయితే జిల్లా వాసులకు అందించే సేవలు మాత్రం అంతంతగానే ఉన్నాయి. దీంతో మరిన్ని రైల్వే సేవల కోసం జిల్లా వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఎలాంటి రైల్వే లైన్లు వేయకుండానే మంచి సేవలు అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా రైల్వే శాఖ తగిన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరుల్లో బొగ్గు గనులు, పాల్వంచలో కేటీపీఎస్, అశ్వాపురంలో కేంద్ర అణుశక్తి విభాగానికి చెందిన భారజల కర్మాగారం, సారపాకలో ఐటీసీ పేపర్‌ బోర్డు, అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల, పామాయిల్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక మణుగూరు వద్ద కొత్తగా భద్రాద్రి థర్మల్‌ వపర్‌ స్టేషన్‌ నిర్మాణంలో ఉంది. అదనంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం, ఆ సమీపంలోనే పర్ణశాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాగా ఆవిర్భవించకముందు నుంచే కొత్తగూడెంలో సింగరేణి కేంద్ర కార్యాలయం ఉంది.

జిల్లాలో ఉన్న ఐదు  నియోజకవర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యమైన పారిశ్రామిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అన్ని జిల్లాల కంటే దూరంగా ఉన్న జిల్లా కూడా భద్రాద్రే కా>వడం గమనార్హం. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన రైలు రవాణాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

పొడిగింపునకు అవకాశమున్నా పట్టింపు లేదు..
ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారా కొత్తగా మరిన్ని రైళ్లు నడిపే అవకాశం ఉన్నప్పటికీ ఆ శాఖ పట్టించుకోవడం లేదు. అనేక సంవత్సరాలుగా జిల్లా వాసులు కోరుతున్నప్పటికీ సంబంధిత అధికారుల్లో నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రస్తుతం జిల్లా నుంచి ఏడు రైళ్లు నడుస్తున్నాయి. మణుగూరు నుంచి హైదరాబాద్‌కు మూడు, మణుగూరు నుంచి కాజీపేటకు ఒకటి, కొత్తగూడెం నుంచి డోర్నకల్‌కు ఒకటి, కొత్తగూడెం నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు ఒక ప్యాసింజర్, కొత్తగూడెం నుంచి విజయవాడ వరకు మరో ప్యాసింజరు  రైలు రాకపోకలు సాగిస్తున్నాయి.

వీటి ద్వారా ప్రతిరోజూ సుమారు 5 వేల మంది  ప్రయాణిస్తున్నారు. వివిధ బస్సు సర్వీసుల ద్వారా రోజుకు సుమారు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు. దీంతో కొత్తగూడెం నుంచి విజయవాడ వరకు నడుస్తున్న రైలును ఎగువన తిరుపతి వరకు, దిగువన మణుగూరు వరకు పొడిగించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కనీసం వారానికి రెండుసార్లైనా తిరుపతికి రైలు నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అలాగే హైదరాబాద్‌కు ఉన్న రద్దీ నేపథ్యంలో ఉదయం పూట ప్రత్యేకంగా ఒక ‘ఇంటర్‌సిటీ’ రైలు సర్వీసు నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మణుగూరు నుంచి ఖమ్మం వరకు ‘పుష్‌పుల్‌’ రైలు కావాలనే డిమాండ్‌ ఉంది. కాగా కొత్తగూడెం నుంచి బల్హార్షా, పుణే మీదుగా ముంబయ్‌ వరకు రైలు నడిపే అవకాశం ఉంది. అయితే ఇందుకు ప్రయాణికుల నుంచి వినతులు వస్తే పరిశీలించే అవకాశం ఉందని రైల్వే వర్గాల  సమాచారం.
 
కొత్త లైన్ల ప్రతిపాదన జాడే లేదు..
ప్రస్తుతం ఉన్న లైన్లపై రైళ్ల పొడిగింపు సంగతి ఇలా ఉంటే.. కొత్త లైన్ల ప్రతిపాదనల జాడే లేకుండా పోయింది. కొత్తగూడెం నుంచి కొవ్వూరు లైన్‌కు 1965లో ప్రతిపాదనలు చేసినప్పటికీ ముందుకు సాగడం లేదు. దీని కోసం కొత్తగూడేనికి చెందిన కొదమసింహం పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో సుదీర్ఘ ఉద్యమాలు సైతం జరిగాయి.

అయితే కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు మాత్రం రూ.704 కోట్ల అంచనా వ్యయంలో రూ.600 కోట్లు భరించేందుకు సింగరేణి సంస్థ ముందుకు రావడంతో ఆ ప్రక్రియ మొదలైంది. ఇక  2004 నుంచి ప్రతిపాదనల్లో ఉన్న మణుగూరు – రామగుండం లైను సైతం ఊసే లేదు. 1984 నుంచి ఊరిస్తూ వస్తున్న 15.5 కిలోమీటర్ల పాండురంగాపురం – సారపాక లైను విషయంలోనూ రైల్వే శాఖ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.


 

మరిన్ని వార్తలు