ఆ పార్టీలను తిప్పికొట్టండి

25 Feb, 2015 01:15 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గతంలో ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. వచ్చే తెలంగాణను రానివ్వనని పట్టుబట్టి, అందరితో జట్టుకట్టి కుట్రలు చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు మళ్లీ తెలంగాణను ఆగం చేసేం దుకు ముందుకు వస్తున్నాయి. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆశలను బీజేపీ సాయంతో భగ్నం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోం ది. ఆ మూడు పార్టీలను తిప్పికొట్టండి.  ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా దేశంలోనే జనరంజక ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్లను కోరుతున్నాం. ఓటు అనే ఆయుధంతో తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్లకు అవకాశం వచ్చింది.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీష్‌రెడ్డి అన్నారు.
 
 జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలూనాయక్, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సిం హారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఎన్నికలలో మోసపోయి కొన్ని ఓట్లు వేసి టీడీ పీ తరఫున కొందరు ఎమ్మెల్యేలను గెలిపించారని, కానీ విద్యుత్‌శక్తి, విద్యాసంస్థలు, కార్పొరేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన బీజేపీ, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి ప్రాణహిత - చేవెళ్ల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు సాయంతో ఏదో చేస్తామని బీజేపీ నేతలు ముందుకుకొస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుని పోయిందని, ఆ పార్టీతో పాటు దానికి మద్దతిచ్చే పార్టీలకు స్థానం లేదనే విధంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
 
 గతంలో జరిగిన అన్ని ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారని, తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ పాలనకు గ్రాడ్యుయేట్ల మద్దతు ఎంత ఉందో నిరూపించేలా తమ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వని హామీలను కూడా ఆరునెలల్లోనే నెరవేర్చిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ జనరంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారన్నారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం వెల్లువలా సాగుతోందని, ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే గొప్ప మార్పునకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. గతంలో పార్టీల సభ్యత్వ కార్యక్రమాలు తమ ఇంటి కార్యక్రమాలుగా సాగేవని, ఇప్పుడు ప్రజలే డిమాండ్ చేసి టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు. తాము కేసీఆర్ వెంట ఉన్నామని చెప్పుకునేందుకు మహిళలు డిమాండ్ చేసి మరీ టీఆర్‌ఎస్ సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
 
 నేడు పల్లా నామినేషన్
 నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేస్తారని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ఎన్జీ కళాశాల గ్రౌండ్ నుంచి ఊరేగింపుగా కలెక్టరేట్‌కు చేరుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరవుతారని వెల్లడించారు. పల్లా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.  
 
 విద్యుత్ అధికారులపై మంత్రి గరం.. గరం
 నల్లగొండ రూరల్: ఇదేం సామగ్రి... మూడేళ్ల నుంచి ఎందుకు నిల్వ ఉంచారు.. ఇలాగైతే తుప్పుపట్టిపోదా.. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు.. అంటూ విద్యుత్ అధికారులపై ఆ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంగవారం స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలోని స్టోర్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో ఇటీవల జరిగిన సంఘటనను ఎస్‌ఈ బాలస్వామిని అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌లో డిస్క్‌లను ధాన్యం రాశుల్లాగా కుప్పగా పోయడంతో ఇలాగైతే తుప్పుపట్టిపోయి రైతులకు ప్రయోజనం లేకుండా పోతాయికదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ఖర్చుచేస్తుంటే మీరు ఇలా ఇష్టానుసారంగా నిల్వ చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటన్నారు.  కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి,నియోజకవర్గ ఇన్‌చార్జి దు బ్బాక నర్సింహారెడ్డి, ఎస్‌ఈ బాలస్వామి, స్టోర్ ఏడీ ఆనంద్‌రావు, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు