దేశం కోసం ఆలోచించేది బీజేపీ

28 Mar, 2019 17:23 IST|Sakshi
సమావేశంలో అభివాదం చేస్తున్న దత్తాత్రేయ, రఘునందన్‌రావు  

చేగుంట(తూప్రాన్‌): కుటుంబ పాలనను ఆలోచించే పార్టీలను పక్కన పెట్టి దేశభద్రత గురించి ఆలోచించే బీజేపీనే గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వడియారం గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ దుబ్బాక నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో కుటుంబ పాలననే ప్రోత్సాహించే పార్టీలు పెరిగిపోయాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మొదలుకొని దేశంలో ములాయంసింగ్‌ యాదవ్, మాయావతి, చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌లు తమ కుటుంబ సభ్యులు పాలకులుగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలోని జాతీయ పార్టీగా కేవలం బీజేపీ పార్టీ మాత్రమే దేశం గురించి ఆలోచిస్తుందని తెలిపారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ 45ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని 55నెలలు పాలించిన బీజేపీ దేశంలో ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

తండాలను కలుపుతూ ప్రధాన రహదారులకు కేవలం తెలంగాణలోనే 260కోట్ల రూపాయలను ఖర్చు చేసామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తండాలను కేవలం గ్రామ పంచాయతీలుగా మార్చారని మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. బీజేపీ తెలంగాణకు 2లక్షల 25కోట్ల రూపాయల నిధులను అందించినట్లు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాలను ఏకంచేసి పుల్వామా దాడికి ధీటుగా పాక్‌ ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టిన బీజేపీని దేశంలోని ప్రజలంతా దేశభద్రతను కాపాడే పార్టీగా గుర్తించారని పేర్కొన్నారు. అన్ని మండలాల్లోని ముఖ్య కార్యకర్తలు మెదక్‌ పార్లమెంటు బీజెపీ అభ్యర్థి రఘునందన్‌రావ్‌ను గెలిపించుకునేందుకు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావ్‌ మాట్లాడుతూ అన్ని మండలాల్లో కార్యకర్తలను చైతన్యంచేసి బీజేపీకి ఓటు వేసి గెలిపించేలా సమాయత్తమయినట్లు తెలిపారు. తన గెలుపునకు కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌యాదవ్, కరుణాకర్‌రెడ్డి, దేశ్‌పాండే, గోపీ, జిల్లా ఉపాధ్యక్షుడు దత్తుప్రకాశ్, స్థానిక నాయకులు ఎల్లారెడ్డి, భూపాల్, చంద్రమౌళి, లక్ష్మణ్,  బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా