నీరు-చెట్టు పేరుతో దోచేస్తున్నారు : వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టు పేరుతో దోచేస్తున్నారు : వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 28 2019 5:17 PM

YS Jaganmohanreddy fires on Chandrababu in Vinukonda  - Sakshi

సాక్షి, గుంటూరు/వినుకొండ : నాగార్జున సాగర్‌ ఉన్నా.. సాగు, తాగు నీరు లేదని.. ఆ సమస్యను పరిష్కరించకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సప్లయ్‌ చేస్తూ.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. నీరు-చెట్టు పేరుతో దోచేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. వినుకొండలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఈ నియోజక వర్గంలో దాదాపు 50 గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి పంటకు వైరస్‌ వచ్చి దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోయారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు నానా అవస్థలు పడుతుంటే.. చంద్రబాబు తమకు ఎలాంటి సాయం చేయలేదని రైతులు తనతో చెప్పారన్నారు.

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ.. 
‘ఇంటెలిజెన్స్‌ అధికారిని విధుల నుంచి తప్పిస్తూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఎన్నికల సంఘం ఆర్డర్‌ను బాబు పక్కన పెట్టించారు. ప్రజల్లో ఉన్న నన్ను హత్య చేయించడానికి యత్నించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో నాపై హత్యాయత్నం చేయించారు. హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే ప్రజలకు రక్షణ ఉంటుందా? వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించి..ఆ నేరాన్ని కుటుంబ సభ్యులపైకి నెట్టే కుట్రలు చేస్తున్నార’ని విమర్శించారు.

దుష్ట పాలనపై చర్చ జరగకుండా కుట్రలు..
‘బాబుకు మేలు చేసేలా విలువలు లేని పార్ట్‌నర్‌, యాక్టర్‌తో పార్టీ పెట్టిస్తారు. కుట్రలో భాగంగా మరో పార్టీని స్థాపించి ఆ పార్టీ గుర్తు, కండువా, అభ్యర్థుల పేర్లు కూడా ఒకేలా ఉండేలా చేశారు. హెలికాప్టర్‌ గుర్తుతో కుట్రలు, మోసాలు చేస్తున్నవారిని గమనించాలి, కుట్రలు చేసే బాబుకు ఓటేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. దుష్ట పాలనపై చర్చ జరిగితే తాను ఔట్‌ అవుతానని బాబుకు తెలుసు. ఆయన బినామీలు, ఎల్లో మీడియాకు కూడా అదే గతి పడుతుందనీ తెలుసు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేలా పూటకో కుట్రను తెరపైకి తెస్తున్నారు. కుట్రలో భాగంగానే ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నార’ని అన్నారు.

చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి..
‘ఎన్నికల తేదీ వచ్చనాటికి బాబు కుట్రలు తారాస్థాయికి చేరుకుంటాయి. ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటును కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి.. ప్రతి ఒక్కరికీ చెప్పండి.. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపొవద్దని.. కొన్ని రోజులు ఓపిక పడితే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభ్తుత్వం వస్తుందని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండ’ని ప్రజలను కోరారు.

Advertisement
Advertisement