మాకు పునరావాసం కల్పించాలి

14 Jul, 2020 12:00 IST|Sakshi
గ్రామస్తులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌

ఇళ్లు కట్టించి ఇచ్చే వరకు గ్రామాన్ని వదలం

జాతీయ రహదారిపై బీఎన్‌ తిమ్మాపురం గ్రామస్తుల ఆందోళన

భువనగిరి టౌన్‌ : బస్వాపురం రిజర్వాయర్‌ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం బీఎన్‌ తిమ్మాపురం గ్రామస్తులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన  చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి వెళ్లేది లేదని పెద్దఎత్తున మహిళలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాస బాధితులందరికీ ఒకే దగ్గర భూమి, ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గతంలో హామీ ఇచ్చిన అధికారులు అమలుకు ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. భూములకు నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పిస్తామని అధికారులు కాలయాపన చేస్తున్నారని, జూలై చివరివారం వరకు రిజర్వాయర్‌లోకి 1.5 టీఎంసీల నీరు నింపడానికి పనులు పూర్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

భువనగిరి మండలం వడపర్తి గ్రామం వద్ద, తిమ్మాపురం రెవెన్యూ పరిధిలో 57 నుంచి 78 సర్వే నెంబర్‌ లలో, ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇళ్ల కోసం స్థలాలు కేటాయించాలని కోరగా, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో రెవెన్యూ అధి కారులు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పునరావాసం, నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ ధర్నా వద్దకు వచ్చి, కలెక్టర్‌ సెలవులో ఉన్నారని, సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అయినా శాంతిచని గ్రామస్తులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెళ్లేది లేదని కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న హన్మకొండ–హైదరాబాద్‌ జాతీయ రహదారిని దిగ్భందనం చేశారు.

పోలీసులు జోక్యం చేసుకుని కలెక్టర్‌ సెలవులో ఉన్నారని చెప్పినా, అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని భీష్మించారు. సుమారు రెండున్నర గంటల పాటు గ్రామస్తులు రాస్తారోకో, ధర్నా చేపట్టడంతో జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏసీపీ భుజంగరావు జోక్యం చేసుకుని సర్ధి చెప్పడంతో గ్రామస్తులు ధర్నా విర మించారు. ధర్నాలో సర్పంచ్‌ పిన్నెం లతరాజు, ఎంపీటీసీ ఉడుత శారద, దర్శన్‌రెడ్డి, ఉడుత కవిత, రావులు రాజు, నందు, మల్లేష్, బాలయ్య, బాల్‌రాజుతో పాటు పెద్దఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఒంటిపై పెట్రోల్‌ పోసుకునేందుకు యువకుడి యత్నం...
జాతీయ రహదారిపై బీఎన్‌ తిమ్మాపురం గ్రామస్తులు ధర్నా చేస్తున్నా, అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదని అవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉడుత రాజు ఒంటిపై పెట్రోల్‌ పోసుకునేందుకు యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆయువకుడి నుంచి పెట్రో ల్‌ డబ్బాను తీసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు