కథ కంచికేనా !

15 Jul, 2019 12:34 IST|Sakshi
అసంపూర్తిగా ఉన్న బోధన్‌ రైల్వే లైన్, బీదర్‌ రైల్వే స్టేషన్‌

సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్‌) : బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి ఐదేళ్ల క్రితం సర్వే చేసి కేంద్రం చేతులు దులుపుకొంది. కొత్తగా మరో రైలు మార్గ సర్వేకు అనుమతించింది. నాందేడ్‌ నుంచి బీదర్‌కు కొత్త రైలు మార్గానికి అనుమతించి, సర్వే చేసేందుకు నిధులను కేటాయించింది. దీంతో బోధన్‌–బీదర్‌ రైలు మార్గం కథ కంచికేనా అంటూ ఈ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో బోధన్‌–బీదర్‌ రైలు మార్గానికి నిధుల కేటాయింపు ఊసెత్తకపోవడం ఇందుకు నిదర్శనం.  

తెలంగాణలో 8 దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌కు నిధుల కే టాయింపునకు మోక్షం లభించడం లేదు.  అసంపూర్తిగా ఉన్న బోధన్‌ రైల్వేలైన్‌ను బీదర్‌ వరకు పొడిగిస్తే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ది చేకూరుతుంది. 2010 రైల్వే బడ్జెట్‌లో   సర్వేకు అనుమతి లభించగా,   2011 ఏప్రిల్‌ నెలలో సర్వే చేయడం ప్రారంభమైంది.  బోధన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రుద్రూర్, వర్నీ, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్‌ వరకు  సర్వే నిర్వహించారు.  

బోధన్‌ నుంచి బీదర్‌ వరకు 138 కిలోమీటర్ల దూరం ఉండగా, 2014లో సర్వే పూర్తయింది. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్‌ వేయవచ్చని అధికారులు తేల్చారు.   2014లో సర్వే పూర్తవడంతో, ప్రతీ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని సర్వత్రా భావించారు. కానీ ఇప్పటి వరకు ఐదేళ్ళుగా ఐదు బడ్జెట్‌లు పూర్తయినా, నయా పైసా నిధులు కూడా మంజూరు కాలేదు.  కేంద్రం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌కు మొండి చేయి చూపిస్తోంది. అయితే ఈ మార్గంలో సర్వే పూర్తయిన ందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయిస్తుందని, సుమారు 2వేల కోట్ల ప్రాజెక్ట్‌ అని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు.    

కొత్తగా నాందేడ్‌ నుంచి బీదర్‌కు సర్వే 
ఇదిలా ఉండగా, బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ నిధులు పెండింగ్‌లోనే ఉండగా, కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నాందేడ్‌–బీదర్‌ రైల్వే లైన్‌కు సర్వే నిర్వహించేందుకు అనుమతించింది. 155 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గానికి రూ.5,152 కోట్ల నిధులు అవసరం. నాందేడ్‌ నుంచి నాయెగాంవ్, దెగ్లూర్, ఔరాద్‌ల మీదుగా ఈ రైలు మార్గానికి సర్వే నిర్వహించనున్నారు. వాస్తవానికి బోధన్‌ నుంచి బీదర్‌కు రైలు లైను ఏర్పాటు చేస్తే నాందేడ్‌ నుంచి జానకంపేట, బోధన్‌ మీదుగా బీదర్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ రైలు మార్గాన్ని పక్కన పెట్టి కొత్తగా మరో రైలు మార్గం కోసం సర్వే చేయడం పట్ల ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ళ క్రితమే బోధన్‌–బీదర్‌ రైలు మార్గం సర్వే పూర్తవగా ఇప్పటికీ నిధులు కేటాయించకుండా, మళ్ళీకొత్త మార్గానికి సర్వే చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ సమగ్ర వివరాలు

 రైల్వే లైన్‌ పొడవు : 138 కిలో మీటర్లు 
 రైల్వే లైన్‌ వెళ్ళే రాష్ట్రాలు : తెలంగాణలో 90 కిలో మీటర్లు, మహారాష్ట్ర,కర్ణాటకలో 48 కిలోమీటర్లు 
 లబ్ధిపొందే జిల్లాలు : నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్‌  
 రైల్వే లైన్‌ ప్రతిపాదించింది : నిజాం సర్కార్‌ హయాంలో (1938) 
ప్రతిపాదనలు ముందుకు సాగింది : కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో (2010లో కేంద్ర మంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు) 
 సర్వే పూర్తయిన సంవత్సరం : 2014 
 రైల్వే లైన్‌కు అవసరమైన నిధులు : 2014లో రూ.1,029 కోట్లు అవసరం 
 ప్రస్తుత అంచనా వ్యయం : 2వేల కోట్లు  
నిధుల కేటాయింపు ఇలా : వెయ్యి కోట్ల నిధులు (రాష్ట్ర ప్రభుత్వం), వెయ్యి కోట్ల నిధులు (కేంద్ర ప్రభు త్వం)

రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులివ్వాలి 
బోధన్‌–బీదర్‌ రైలు మార్గానికి సర్వే పూర్తయింది. రూ.2వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టాల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులు కేటాయిస్తే, 50శాతం కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్ట్‌ ముందుకు సాగుతుంది.
– బీబీ పాటిల్, ఎంపీ, జహీరాబాద్‌ 

మరిన్ని వార్తలు