ముగిసిన పుస్తక ప్రదర్శన

26 Dec, 2018 09:07 IST|Sakshi

వందకు పైగా పుస్తకాల ఆవిష్కరణ  

చివరి రోజు భారీగా తరలొచ్చిన సందర్శకులు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం మంగళవారంతో ముగిసింది. 10 రోజుల పాటు ఒక సాహిత్య సాంస్కృతిక ఉత్సవంలా జరిగిన పుస్తక ప్రదర్శనలో దాదాపు 8లక్షల మంది పాల్గొన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం పుస్తకప్రియులు వచ్చారు. ప్రదర్శనలో దాదాపు 25లక్షలకు పైగా పుస్తకాల విక్రయాలు జరగ్గా, ప్రచురణ సంస్థలు రూ.25 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. మొత్తం 331 స్టాళ్లను ఏర్పాటు చేశారు. హ్యాచెట్స్, సేజ్, పెంగ్విన్‌ వంటి ప్రచురణ సంస్థలు కూడా పాల్గొనడంతో ఆంగ్ల సాహిత్య పాఠకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని రావడంతో పండగ వాతావరణం నెలకొంది. ప్రదర్శన ప్రారంభించిన తర్వాత రెండు రోజులు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాఠకులు తక్కువ సంఖ్యలో వచ్చారు. కానీ ఆ తర్వాత ప్రదర్శనలో సందడి నెలకొంది. చివరి రోజు కూడా రాత్రి 9గంటల వరకు స్టాళ్లు కిటకిటలాడాయి. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్, హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉప రాష్ట్రపతి రాక...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కీలకమైన ప్రసంగం చేశారు. ఈసారి ఉపరాష్ట్రపతి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రతిరోజు సాహితీ సమాలోచనలు జరిగాయి. సమకాలీన సాహిత్యంపై జరిపిన చర్చల్లో ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు కె.శ్రీనివాస్, బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, ప్రముఖ కవి, రచయిత సీతారాం, యాకుబ్‌ తదితరులు పాల్గొన్నారు. మంచి పుస్తకం, విశాలాంధ్ర, ఎమెస్కో, నవ తెలంగాణ, తెలుగు బుక్‌ తదితర సంస్థలు పిల్లల సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. బాల చెలిమె పుస్తక ప్రచురణ సంస్థ వందల కొద్దీ పిల్లల పుస్తకాలను ఏర్పాటు చేసింది. ఈసారి ‘బుక్‌వాక్‌’ మరో ప్రత్యేక ఆకర్షణ. 

ఆవిష్కరణలు...
ఈసారి వందకు పైగా కొత్త పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య రాసిన ‘ ఫ్రమ్‌ ఏ షెఫర్డ్‌ బాయ్‌ యాన్‌ ఇంటెలెక్చువల్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే నారాయణస్వామి రాసిన ‘ వానొస్తదా’, ‘నడిచొచ్చిన తోవ’, వాయువేగం సుబ్రహ్మణ్యం రాసిన ‘ట్వైస్‌ టోల్డ్‌ స్టోరీస్‌’, ప్రముఖ సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ రాసిన ‘ దోసిట చినుకులు’ తదితర పుస్తకాలను ఈ  ప్రదర్శనలో ఆవిష్కరించారు. అలాగే బుక్‌ ఎగ్జిబిషన్‌ రచయితలను ప్రోత్సహించేందుకు ‘కవి సంగమం’ పేరుతో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సుమారు 139 మంది రచయితల పుస్తకాలను ఈ స్టాల్‌ ద్వారా విక్రయించారు. 

ఆకట్టుకున్న ‘దివ్య వేదవాణి’...   
వేదధర్మ ప్రచార ట్రస్టు ఆధ్వర్యంలో ముద్రించిన ‘దివ్య వేదవాణి’ ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచింది. 4,440 పేజీలతో ముద్రించిన ఈ పుస్తకం బరువు సుమారు 35 కిలోలు. నాలుగు వేదాలతో రూపొందించిన ఈ సమగ్ర సాహిత్యం వెల రూ.24,000. వేదానంద సరస్వతీ స్వామి, వేదాచార్య డాక్టర్‌ మర్రి కృష్ణారెడ్డి చాలా ఏళ్లు కష్టపడి  ఈ పుస్తకాన్ని తెలుగులో రాశారు. ‘ప్రదర్శనలో ఆరుగురు పాఠకులు పుస్తకాన్ని బుక్‌ చేసుకున్నారని, ఇప్పటి వరకు ఎవరూ కొనుగోలు చేయలేద’ని రచయిత కృష్ణారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి  17న ఈ పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు అంకితమివ్వనున్నట్లు పేర్కొన్నారు. 

కనుల పండువగా ‘బాలోత్సవ్‌’...
బాలోత్సవ్‌ వేదికగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాపులు, మిమిక్రీ, మ్యాజిక్‌ తదితర అంశాలలో పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేశారు. పిల్లల సృజనాత్మకతకు ఈ పోటీలు మరింత పదును పెట్టాయి. ‘ప్రదర్శనలో సగం వరకు  చిన్నారుల ప్రాతినిధ్యమే ఉంది. అది మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు ఏడాది పొడవునా పుస్తక ప్రదర్శన నిర్వహించాలని భావిస్తున్నాం. బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో త్వరలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తాం’ అని బుక్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌‘సాక్షి’ తో చెప్పారు. 

మరిన్ని వార్తలు