విజృంభిస్తున్న విషజ్వరాలు

23 Aug, 2015 02:19 IST|Sakshi
విజృంభిస్తున్న విషజ్వరాలు

డెంగీకి ఐదుగురు బలి
రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇద్దరు..
ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత

 
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు మొత్తం ఐదుగురు డెంగీ బారిన పడి మృతి చెందారు. ఇందులో ముగ్గురు ఆదిలాబాద్ జిల్లా వాసులుండగా, రంగారెడ్డి.. మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కరున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూ డెంలో వారం రోజులుగా నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 12 మంది డెంగీ జ్వరంతో అస్వస్థతకు గురైనట్లు తేలింది. శనివారం రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో డెంగీతో ఇద్దరు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మూర్తి, అనంతలక్ష్మి(40) దంపతులు కొన్నేళ్లక్రితం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండల పరిధిలోని పూడూర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. అనంతలక్ష్మి మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించారు. డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో ఆమెను శుక్రవారం రష్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ సోకిందని నిర్ధారించారు. చికిత్స చేస్తుండగానే అనంతలక్ష్మి శనివారం ఉదయం మృతి చెందింది.

అలాగే, మెదక్ జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామానికి చెందిన మీస ఐల య్య, కనకవ్వల కుమారుడు విష్ణు(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఐదు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం రావడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేయగా, అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం విష్ణు పరిస్థితి విషమించడంతో క్యాన్సర్ ఉందని చెప్పారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించగా క్యాన్సర్ లేదని, డెంగీతో రక్తకణాలు పడిపోయాయని తెలిపారు. చేసేదిలేక వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే  శనివారం తెల్లవారుజామున మృతి చెందాడనికు టుంబసభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పాతహీరాపూర్ గ్రామంలో కనక సంగీత(20) జ్వరంతో శనివారం చనిపోరుుంది. జైనూర్ మండలం దబోలి గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్రం చందర్‌షావ్(13) జ్వరంతో శనివారం మరణించాడు. కౌటాల మండలం వీర్దండి గ్రామానికి చెందిన మడపతి సుందరబాయి(50) విషజ్వరంతో శుక్రవారం రాత్రి మరణించింది.  

 కొత్తగూడెంలో 12 మందికి డెంగీ..
 ఖమ్మం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే డెంగీ లక్షణాలతో ముగ్గురు మృతిచెందగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ చేసే పరీక్షల్లో మరికొంతమందికి డెంగీ సోకినట్లు తేలింది. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది వారం రోజులుగా నిర్వహిస్తున్న పరీక్షల్లో రామవరం పరిసర ప్రాంతాల్లో 12 మందికి డెంగీ లక్షణాలు కన్పించినట్లు నిర్ధారించారు.  డెంగీతో బాధపడేవారు ఖమ్మం, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రామవరంలోని బర్మాక్యాంప్‌కు చెందిన ఆరుగురికి డెంగీ లక్షణాలతో జ్వరం సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 6 నెలల పాప రమణాతి లక్ష్మి,  డి.భార్గవి, దొంగ మురళికృష్ణ, కేత అన్వేష్‌తోపాటు మరో ఇరువురికి, అదేవిధంగా చిట్టిరామవరంలో ముగ్గురికి, 12వ వార్డులో ఇద్దరికి, 8,9,10 వార్డుల్లో కూడా మరికొన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
 
ముందు జాగ్రత్తలు తీసుకోండి

హైదరాబాద్ : అన్ని జిల్లాల్లోని గిరిజనప్రాంతాల్లో విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు గిరిజన ఆవాసాల్లో తగిన జాగ్రతలు తీసుకోవాలని ఈ శాఖ కార్యదర్శి జీడీ అరుణ, కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, ఆదిలాబాద్ తదితర జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. శనివారం ఈ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా  ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులను వెంటనే ఔట్‌సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని చెప్పారు. ఇదివరకే శిక్షణ ఇచ్చిన వారికి ప్రాధాన్యతనిచ్చి వెంటనే వారిని విధుల్లో చేరేలా చూడాలన్నారు. విషజ్వరాలు ఏ మేరకు ప్రబ లాయో, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను ఒక కమిటీ ద్వారా పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సులు పంపించాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలుతున్నచోట తాత్కాలికంగా ఇతర ప్రాంతాల నుంచి డాకర్లు, సిబ్బందిని తెప్పించుకుని, వైద్యసేవలను అందించాలన్నారు.  జిల్లాల్లో మందులను ముందస్తుగా అందుబాటులో పెట్టుకోవాలని మంత్రి చందూలాల్ అధికారులకు సూచించారు.
 

మరిన్ని వార్తలు