నిజాంను పొగడడం తెలంగాణను అవమానపర్చడమే

15 Mar, 2015 03:46 IST|Sakshi

హుస్నాబాద్‌రూరల్ : సాయుధ పోరాటంలో దొడ్డి కొంరయ్యను కర్కషంగా చంపిన నిజాంను కేసీఆర్ పొగడడం తెలంగాణను అవ మానపర్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు అనభేరి 67వ వర్ధంతి సభను శుక్రవారం రాత్రి మహ్మదాపూర్ గుట్టల్లో ఘనంగా నిర్వహించారు. గుట్టల నుంచి కొవ్వత్తులతో ర్యాలీగా గ్రామంలోని స్తూపం వరకు పాదయాత్రగా వచ్చి నివాళులర్పించారు. హైదరాబాద్ కార్పొరేషన ఎన్నికల్లో గెలిచేందుకే ఎంఐఎంను పొగుడుతున్నారన్నారు. కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులకు ప్రథమ శత్రువుగా మారుతారని హెచ్చరించారు.

కమ్యూనిస్టులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసి పనిచేస్తామన్నారు. భూర్జువా పార్టీలతో స్నేహం చేయడం శాపంగా మారిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సూర్య చంద్రులున్నంత వరకు అమరుల త్యాగాలు మరువబోమన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తెలంగాణ సాంస్కృతిక శౌర్య రాష్ట్ర కన్వీనర్ పాశం యాదగిరి, సినీ హీరో మాదాల రవి, జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, మాజీ కార్యదర్శి నారాయణ, నాయకులు సృజన్‌కుమార్ , అయిలయ్య, మల్లేశ్, శోభారాణి, సర్పంచ్ రమేశ్,తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు