‘పేట’ నిండా ‘బట్టీ’లే!

16 Feb, 2019 11:17 IST|Sakshi

ఇష్టారాజ్యంగా ఇటుకబట్టీల ఏర్పాటు 

పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్‌ శాఖలు

విలువైన కలప వినియోగం

పక్కదారి పట్టిన ఉచిత విద్యుత్‌

పట్టా, ప్రభుత్వ భూముల్లో బట్టీలు

శిఖం, పొలాల నుంచి మట్టి తరలింపు

శివ్వంపేట(నర్సాపూర్‌): మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇటుకబట్టీలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ఇటుకబట్టీలపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీరి వ్యాపారం దర్జాగా కొనసాగుతోంది. మండలంలోని కొత్తపేట గ్రామంలో సుమారు 30నుంచి 40వరకు ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి పనులు చేస్తున్నా పట్టించుకున్న అధికారులే లేరు. 

నిబంధనలకు పాతర
నిబంధనల ప్రకారం ఇటుకబట్టీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సంబంధిత వ్యాపారులు ఇవేమీ పట్టించుకోకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. బట్టీల్లో వాడేందుకు కలపతోపాటు తయారీకోసం మట్టిని స్థానిక చెరువులు, కుంటలు, పొలాల్లో నుంచి తరలిస్తున్నారు. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, మైనింగ్‌ శాఖల సిబ్బంది కనుసైగల్లోనే వీరి వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉచిత విద్యుత్‌ దుర్వినియోగం
వ్యవసాయ బోరుబావుల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ అక్రమ దారి పడుతోంది. బట్టీల సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బోర్లను యథేచ్ఛగా ఇటుక బట్టీల కోసం వినియోగించుకుంటున్నారు. ఆయా బోర్లకు వచ్చే ఉచిత విద్యుత్‌ ద్వారానే వీటికి నీటి సరఫరా జరుగుతోంది. అయినా సంబంధిత విద్యుత్‌శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శిఖం భూమి నుంచి దర్జాగా మట్టిని తరలిస్తున్నా సంబంధిత ఇరిగేషన్‌ శాఖ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. పట్టా, ప్రభుత్వ భూముల్లో బట్టీల నిర్వహిస్తున్నా రెవెన్యూ సిబ్బంది  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విలువైన కలప బట్టీల్లో వినియోగిస్తున్నా సంబంధిత అటవీశాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

ఇతర రాష్ట్రాల కూలీలతో..
ఇటుకబట్టీల వ్యాపారులు ఒడిశా, చత్తీస్‌గఢ్, బీహార్‌ ప్రాంతాలకు చెందిన కూలీలతో బట్టీల్లో పనిచేయించుకుంటున్నారు. వీరి కుటుంబాల్లో ఉన్న బాలకార్మికులతో సైతం పనులు చేయించుకుంటున్నారు. వెల్దుర్తి–నర్సాపూర్‌ ప్రధాన రోడ్డుకు ఆనుకొని బట్టీలు ఏర్పాటు చేయడంతో వాటిని కాల్చేటప్పుడు వచ్చే కాలుష్యంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఆనుకొని అక్రమ వ్యాపారం జరుగుతున్నా సంబంధిత శాఖల సిబ్బంది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా  జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నా దృష్టికి రాలేదు : 
మండలంలో అక్రమంగా వెలసిన ఇటుక బట్టీల గురించి నా దృష్టికి రాలేదు. కొత్తపేటలో వెలసిన ఇటుక బట్టీలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– తహసీల్దార్‌ భానుప్రకాష్‌
 

మరిన్ని వార్తలు