పత్తివిత్తులో 'దేశీ'విప్లవం

6 Apr, 2017 07:23 IST|Sakshi
పత్తివిత్తులో 'దేశీ'విప్లవం

బీటీ టెక్నాలజీతో విత్తనాల అభివృద్ధి
- సగానికి సగం తగ్గనున్న ధర
- వచ్చిన పంట నుంచే మళ్లీ విత్తనాలు వాడుకునే అవకాశం
- బీటీ–1, బీటీ–2లకు దీటుగా చీడపీడలను తట్టుకునే సామర్థ్యం
- దేశీయ విత్తనాలను అభివృద్ధి చేసిన పంజాబ్‌ వ్యవసాయ వర్సిటీ
- ఖరీఫ్‌ నాటికి మార్కెట్‌లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు
- ఇక బీటీ విత్తన కంపెనీల ఆగడాలకు చెక్‌


సాక్షి, హైదరాబాద్‌: బీటీ పత్తి.. ఇకపై ఈ విత్తనం కోసం రైతులు వేలకు వేలు ధారపోయనక్కర్లేదు! కంపెనీలు ఎంత చెబితే అంత రేటుకే కొనుక్కోనక్కర్లేదు. ధర సగానికి సగం తగ్గబోతోంది. అంతేకాదు.. చేనులో పండిన పత్తి నుంచి వచ్చిన విత్తనాలనే మళ్లీ వాడుకోవచ్చు. బీటీ–1, బీటీ–2 పత్తి విత్తనాల మాదిరే చీడపీడలను తట్టుకునే సామర్థ్యంతోపాటు వాటికన్నా తక్కువ ధరకే దేశీయ విత్తనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు సుదీర్ఘ పరిశోధనల తర్వాత ఈ బీటీ పత్తి విత్తనాలను అభివృద్ధి చేశారు.

ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విత్తన కంపెనీల గుత్తాధిపత్యానికి కళ్లెం పడటంతోపాటు పత్తి విత్తనంలో ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాదికి ఈ విత్తనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయని, ఈ ఏడాది కొన్ని ప్రాంతాలకు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా ఇప్పటికే పంజాబ్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ఈ విత్తనాల ద్వారా పంట పండించి మంచి ఫలితాలు సాధించారని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం బీటీ పత్తి విత్తన రకాలన్నీ హైబ్రీడ్‌లోనే వచ్చాయి. కానీ పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధారణ రకాల్లోనే బీటీ టెక్నాలజీని ఉపయోగించి ఈ విత్తనాలను తయారు చేసింది. దీనివల్ల ఈ విత్తనం వేసిన రైతు పంట పండాక తిరిగి దాన్నే విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే విత్తనం తక్కువ ధరకు లభించడంతోపాటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం బోల్‌గార్డ్‌ (బీజీ)–1 పత్తి విత్తన ధర రూ.635గా.. బీజీ–2 విత్తన ధర రూ.800గా ఉంది. అయితే పంజాబ్‌ విశ్వవిద్యాలయం తయారు చేసిన పత్తి విత్తన వెరైటీ ఆ ధరలో సగానికే లభించనుంది.

ఇదీ బీటీ కథా కమామిషు..
బీటీ పత్తి విత్తనం రాకముందు.. (2002కు మందు) హైబ్రీడ్‌ విత్తనాలే వాడేవారు. ఈ విత్తనానికి కాయతొలిచే పురుగు ఎక్కువగా ఆశించేది. ఎన్ని రకాల మందులు వేసినా తగ్గేది కాదు. దీంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు పడేవారు. దీనికి విరుడుగా బీటీ టెక్నాలజీతో సరికొత్త విత్తనాలు తయారయ్యాయి. బహుళ జాతి కంపెనీ మోన్‌శాంటో.. మహారాష్ట్ర హైబ్రిడ్‌ కంపెనీ (మైకో)తో కలసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ–1 పత్తి విత్తన వ్యాపారం ప్రారంభించింది.

ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఏ ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం కొనసాగించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బీటీ–1కు కూడా చీడపీడలను తట్టుకునే శక్తి పోవడంతో 2006లో బీటీ–2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. దానికి ఆ కంపెనీ పేటెంట్‌ రాయల్టీ వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రాయల్టీపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాయల్టీపై పోరాడారు. ఆయన పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రాయల్టీని అమాంతం తగ్గించింది.

బీటీ–2తో నష్టపోయిన రైతులు
ప్రస్తుతం రైతులు ఎక్కువగా బీటీ–2 పత్తి విత్తన రకాన్ని వాడుతున్నారు. అయితే దీనికి కూడా పురుగును తట్టుకునే శక్తి తగ్గింది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల గులాబీ రంగు పురుగు వ్యాపించింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మోన్‌శాంటో టెక్నాలజీకి కాలం చెల్లిందన్న ప్రచారం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా జాతీయ విత్తన కంపెనీలు స్వర్ణభారత్‌ కన్సార్టియంగా ఏర్పడి బీటీ–3 తరహాలో కొత్త వంగడాన్ని తయారుచేశాయి.

దీనికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి ఉందని తేలిందని అంటున్నారు. బీటీ టెక్నాలజీలోని ఇతర జన్యువుతో దీన్ని తయారుచేశారు. కానీ దాన్ని మోన్‌శాంటో అడ్డుకోవడంతో ఇన్నాళ్లుగా అది రైతుల వద్దకు చేరుకోలేకపోయిందని విత్తన సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన సాధారణ సూటి పత్తి విత్తనంతో మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి గండి పడుతుందని అంటున్నారు.

మనకు లాభమే..
పంజాబ్‌ వ్యవసాయ వర్సిటీ నిపుణులు తయారు చేసిన పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. తెలంగాణలో ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు. ఇతర అన్ని పంటల కంటే పత్తి సాగే అధికం. 2015–16లో పత్తి ధర గణనీయంగా తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, సోయాబీన్‌ పంటలను ప్రోత్సహించింది. దీంతో 2016–17 ఖరీఫ్‌లో పత్తి 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. అయితే ఈసారి పత్తికి అధిక ధర పెరగడంతో రైతులు తిరిగి పత్తి వైపే చూస్తున్నారు. దీంతో ఈసారి రాష్ట్రంలో కోటి పత్తి విత్తన ప్యాకెట్లు అమ్ముడుపోయే అవకాశముంది.

ధర తగ్గుతుంది
పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన పత్తి విత్తనం హైబ్రీడ్‌ రకం కాదు. కాబట్టి దీన్ని ఒకసారి విత్తనంగా ఉపయోగించిన రైతులు తర్వాత తాను పండించి మళ్లీ విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ధర కూడా గణనీయంగా తగ్గుతుంది. - కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌

బీటీ టెక్నాలజీ విఫలమైంది
బీటీ టెక్నాలజీనే విఫలమైంది. అలాంటిది పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన బీటీ పత్తి సూటి రకం విత్తనం వల్ల ప్రయోజనం ఏముంటుంది? సూటి రకమైనా బీటీ చొప్పించాక అది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అంతర్గత పరిశోధన వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంటుంది. అంతేకాదు వారు తయారుచేసిన బీటీ సూటి రకం పత్తి విత్తనంపై స్వచ్ఛంద సంస్థ ద్వారా పరిశీలన చేసిన తర్వాతే దీనిపై మాట్లాడొచ్చు. - డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు

>
మరిన్ని వార్తలు