తుమ్మలన్నా.. ఇక షికారేనా..?

26 Aug, 2014 01:38 IST|Sakshi
తుమ్మలన్నా.. ఇక షికారేనా..?

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో గ్రూపు గొడవలు మొదలైనప్పటి నుంచి తుమ్మల, నామా నాగేశ్వరరావు వర్గాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. అంతకుముందు టీడీపీలో తుమ్మల హవానే సాగగా.. నామా ఎంట్రీతో సీన్ రివర్సయింది. నామాకు పార్టీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం, పలుకుబడి క్రమంగా తుమ్మలను దూరం చేశాయి. పార్టీ అధినాయకునితో కూడా కొన్ని విషయాల్లో స్పర్థలు ఏర్పడ్డాయి. ఈ వివాదం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత ముదిరింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన తుమ్మల ఓటమికి పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం సర్వశక్తులొడ్డినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తన వర్గీయుడు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు పాలేరు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత నామా ఒత్తిడితో అధినేత చంద్రబాబు మాట మార్చడం  తుమ్మలను అవమానానికి గురిచేసినట్టయింది. తన ఓటమి, జిల్లా పార్టీలో తన మాటకు విలువలేకుండా పోవడం ఇవన్నీ చూశాక సార్వత్రిక ఎన్నికల ఫలితాల  తర్వాత తుమ్మల పునరాలోచనలో పడ్డారు.

 ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారుతారని ఊహాగానాలు వచ్చాయి కానీ జరగలేదు. ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా తుమ్మల పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ నాయకత్వం తుమ్మలతో చర్చలు జరిపిందని సమాచారం. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో తన సన్నిహితుని ఇంట్లో తుమ్మలతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత జిల్లాలో ఆయన అనుచరులకు కొత్త ఊపు వచ్చినట్టయింది. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయని, తమ నాయకుడు టీఆర్‌ఎస్‌లోకి వె ళ్లిపోతున్నారన్న సంకేతాలు పార్టీ కేడర్‌కు అందడంతో వారంతా ఎక్కడిక క్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని తుమ్మలకు బాసటగా నిలుస్తున్నారు.

 జిల్లా పరిషత్ పాలకవర్గం ఆయన వెంటే...
 జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనివార్య పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం తుమ్మలకు ప్రాధాన్యమిచ్చింది. ఆయన ప్రతిపాదించిన కవితకు చైర్‌పర్సన్ పీఠాన్ని కట్టబెట్టింది. అయినా, తుమ్మల సంతృప్తి చెందలేదని కేడర్ అంటోంది. తప్పనిసరిగా ఆయన చెప్పిన వ్యక్తికి ఇవ్వాలి కనుక ఇచ్చారే తప్ప అలాంటి పరిస్థితి లేకపోయివుంటే అధినేత నామా వైపే మొగ్గు చూపే వారని తుమ్మల వర్గం భావిస్తోంది.

ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఉండటం వృథా అనే అభిప్రాయానికి కూడా తుమ్మల అనుచరగణం వచ్చింది. ఆ కోణంలోనే ఇటీవలే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కవిత కూడా తాను తుమ్మల వెంటే ఉంటానని బహిరంగ ప్రకటన కూడా చేశారు. వారం రోజుల క్రితం తుమ్మల పార్టీ మార్పుపై సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించగా, ఏకంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల వెంటే తానూ అని ప్రకటించడం చర్చనీయాంశమైంది.

మరోవైపు నియోజకవర్గాల వారీగా తుమ్మల వర్గీయులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సోమవారం పాలేరు నియోజకవర్గ నేతలతో పాటు జిల్లాలోని 10 మంది జడ్పీటీసీలు సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల బాటలోనే పయనిస్తామని తీర్మానించటం గమనార్హం.

 ముహూర్తం కూడా ఖరారైందా?
 తుమ్మల టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తుమ్మల త్వరలోనే జిల్లాకు వస్తారని, వెంటనే జిల్లాస్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత మరోసారి కేసీఆర్‌తో మాట్లాడి తేదీలు నిర్ణయిస్తారని చెపుతున్నారు. అయితే, వచ్చే నెల 3 లేదా 5 తేదీల్లో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో పాటు జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు వెళ్లిపోతారని ప్రచారం.

ఆయన ముఖ్య అనుచరులుగా పేరున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం పార్టీ వీడరని తెలుస్తోంది. ఎమ్మెల్సీ బాలసాని మాత్రం తుమ్మల వెంటే ఉంటారని సమాచారం. వెంకటవీరయ్య అంశంపై తర్వాత నిర్ణయం జరుగుతుందని పార్టీ కేడర్ అంటోంది. ఇటీవల హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో తుమ్మల చికిత్స పొందుతుండగా పరామర్శకు వచ్చిన చంద్రబాబుకు తాను పార్టీ మారే విషయం తుమ్మల చెప్పారని ప్రచారం.

 గులాబీ దళంలో ఇమిడేనా?
 జిల్లాలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో ఇమడగలరా అనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆప్యాయంగా పిలవగలిగిన సాన్నిహిత్యం ఉన్నా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఏమేరకు సహకరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ మారితే ఆయనకు, అనుచరులకు లభించే ప్రాధాన్యం ఎలా ఉంటుంది? మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌లో ఉన్న వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు? ఇప్పటికే పార్టీ తరఫున గెలిచి ఉన్నఎమ్మెల్యే..తన చిరకాల ప్రత్యర్థితో మసలుకోవటం ఏమాత్రం ఇష్టంలేని తుమ్మల అసలు టీఆర్‌ఎస్‌లోనే చేరరు అనే ప్రచారం కూడా జరుగుతోంది.

 తుమ్మల పార్టీలో చేరిన వెంటనే అమాత్య పదవి ఇస్తారా..? ఎలా సర్దుబాటు చేసుకుంటారనేది కూడా ప్రశ్నగా మారింది.  కానీ, టీడీపీలో ఉండడం కన్నా పార్టీ మారడమే మేలనే భావన తుమ్మల అనుచరవర్గంలో బలంగా కనిపిస్తోంది. ఒకవేళ తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరితే మాత్రం జిల్లా రాజకీయముఖచిత్రంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని రాజకీయవిశ్లేషకుల అంచనా.

మరిన్ని వార్తలు