సిమెంట్ ధరలు తగ్గించాలి : నంద్యాల

21 Jun, 2014 05:46 IST|Sakshi
సిమెంట్ ధరలు తగ్గించాలి : నంద్యాల

 హుజూర్‌నగర్ : సిమెంట్ ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల  నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఊహించని విధంగా సిమెంట్ ధరలు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం ఆగిపోయి అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. సిమెంట్ ఉత్పత్తిలో ముడిసరుకు, విద్యుత్, కూలీల ఖర్చులు పెరగకుండానే అనూహ్యంగా  ఉత్పత్తిదారులు ధరలు పెంచారన్నారు.

ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోకుండా కాలయాపన చేయడం తగదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వాల కాలంలో గృహనిర్మాణశాఖ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేయాలన్నారు. ఈ మాఫీతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటీనీ అమలుచేసి ప్రజల విశ్వాసాన్ని పొందాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలని సీపీఎం పార్టీ కోరుకుందని, కానీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినందున నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తామన్నారు.

జిల్లాలోని 541 చెరువులు, 4 వేల కుంటలు పూడికతో ఉండి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా చెరువులు, కుంటలలోని పూడికను తొలగించినట్లయితే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.  అధికారంలోకి వచ్చాక అద్భుతాలు సృష్టిస్తానంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్న నరేంద్రమోడీ నేటి వరకు కనీసం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు దృష్టి సారించడం లేదన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, డివిజన్ కార్యదర్శి పారేపల్లి శేఖర్‌రావు, జిల్లా కమిటీసభ్యులు వట్టికూటి జంగమయ్య, పులిచింతల వెంకటరెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు