చీటింగ్!

17 Jul, 2015 02:06 IST|Sakshi
చీటింగ్!

సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. కౌన్సెలింగ్‌కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఏ బదిలీలు రద్దవుతాయో.. ఏ పోస్టు బ్లాక్ అవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. పైగా పారదర్శకంగా జరగడంలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.

 షెడ్యూల్ ప్రకారం.. మొదటి రోజు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నిర్వహించారు. ఇక ఆ రోజు నుంచి అస్తవ్యస్తంగానే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా కొంతమంది హెచ్‌ఎంలు సబ్జెక్ట్ టీచర్లు ఉన్నప్పటికీ పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ అదనపు పాయింట్లు పొందారన్న ఆరోపణలున్నాయి. మరునాడు జరిగిన హెచ్‌ఎంల ప్రమోషన్ల ప్రక్రియలో సైతం ఆప్షన్ ఇచ్చిన తరువాత కూడా ఉపాధ్యాయలు తిరిగి తమ స్థానాలు మార్చుకున్నారనే విమర్శలున్నాయి. అనంతరం స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో బయోలజీ టీచర్లకు ఉంటాయని ప్రకటించారు. తీరా అక్కడికి వెళ్లాక ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంల బదిలీలంటూ వారిని వెనక్కి పంపారు.

 కావాల్సిన వారికి పెద్దపీట..
 బదిలీల జాబితాల్లో కొన్ని ఖాళీ ప్రదేశాలను మొదట్లో చూపకుండా కొంతమంది టీచర్లకు ప్రయోజనం కలిగేలా మధ్యలో ప్రవేశ పెట్టారన్న ఆరోపణాలున్నాయి. ఈ క్రమంలో సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో నంగునూరు మండలం అంక్షాపూర్ పాఠశాల పేరును మధ్యలో ఇరికించారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఖాళీలను మొదట చూపించినప్పటికీ తీరా బదిలీ సమయంలో తీసివేశారని తెలుస్తోంది. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో 704 మంది విద్యార్థులు ఉండగా అక్కడ 3 సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఒకే టీచర్ పనిచేస్తున్నారు.

కాని ఖాళీగా ఉన్న రెండు పోస్టులు ప్రమోషన్లలో చూపలేదు. దీంతో ఒకే టీచర్ సక్సెస్ స్కూల్‌గా ఉన్న ఆ ఉన్నత పాఠశాలలో 704 మందికి ఎలా బోధించాలో తెలియని పరిస్థితి. బుధవారం రాత్రి ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంల ప్రమోషన్‌లో సైతం మొదట చూపని ఖాళీలను తరువాత చూపారని ఉపాధ్యాయులు అంటున్నారు. అదే విధంగా నర్సాపూర్ ప్రాంతంలో పనిచేసే ఒక ఉపాధ్యాయ సంఘం నాయకుణ్ణి కౌన్సెలింగ్ అనంతరం 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న పటాన్‌చెరు ప్రాంతానికి బదిలీ చేశారని ఉపాధ్యాయులు ఆరోపించారు.

 అర్హతలు లేకున్నా పదోన్నతులు
 కొంతమందికి విద్యాపరమైన అర్హత లేనప్పటికీ ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రమోషన్ల జాబితాలో వారి పేర్లను చేర్చారని తెలుస్తోంది. ఏరోజు కూడా కౌన్సెలింగ్ సమయానుకూలంగా జరగలేదు. జరుగుతున్న అవకతవకల వల్ల ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొంది. కౌన్సెలింగ్ హాల్‌లో కరెంట్ పోతే జనరేటర్ సౌకర్యం లేక మహిళా టీచర్లు చిమ్మ చీకట్లోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టాయిలెట్ సౌకర్యం లేక నానా అవస్థలు పడ్డారు.

మూడు, నాలుగు చోట్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో ఎప్పుడు, ఎక్కడ ఏ కేటగిరి ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయో తెలియక పలువురు ఆందోళనకు లోనయ్యారు. 2013లో బదిలీ అయి ఈనెల 19న రిలీవ్ అయిన ఉపాధ్యాయులను తిరిగి వెనక్కి రమ్మన్న ఉత్తర్వులు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముందుచూపులేక అప్పట్లో వారిని రిలీవ్ చేసి ఇప్పుడు వెనక్కి రమ్మంటున్న అధికారులపై ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.

 బదిలీలవుతున్నా.. ఉత్తర్వులేవి?
 ఇంత వరకు వివిధ కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు పూర్తయినప్పటికీ ఒక్క పీజీ హెచ్‌ఎం బదిలీల్లో తప్ప ఇతరులెవరికీ ఉత్తర్వులు అందలేదు. కొంతమంది ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్‌ఎంలు.. బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయినప్పటికీ వారు పాత స్థలాల్లో ఎంఈఓ బాధ్యతకూడా నిర్వహిస్తున్నారు. దీంతో అటు బదిలీ అయిన పాఠశాలలో.. ఇటు ఎంఈఓ స్థానంలో రెండు పడవలపై ప్రయాణంలా విధులు నిర్వహిస్తున్నారు. బదిలీ అయిన ఇతర కేటగిరీ ఉపాధ్యాయులు ఉత్తర్వులు అందుకోలేక అటు సొంత పాఠశాలలో పాఠాలు బోధించలేక.. ఇటు కొత్త పాఠశాలకు వెళ్లే అవకాశం లేక ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చదువులు చతికిల పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు