పత్తి తూకాల్లో మోసం

26 Nov, 2014 23:16 IST|Sakshi

బషీరాబాద్: పత్తి తూకాల్లో దళారులు మోసం చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. వివరాలు.. మండల పరిధిలోని నీళ్లపల్లి గ్రామానికి తాండూరుకు చెందిన వ్యాపారి కాసిం పాషా పత్తి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. రూ. 3800 చొప్పున దాదాపు 30 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశాడు.

 అయితే ఆ సమయంలో తూకాల్లో మోసం ఉన్నట్లు కొందరు రైతులు గమనించారు. దీంతో వారు కాసిం పాషాను చుట్టుముట్టి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యాపారిని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమవగా రైతులు అడ్డుకున్నారు. వ్యాపారి స్టేషన్‌కు వెళితే తమకు న్యాయం జరగదని, ఇక్కడే పంచాయతీ తేల్చాలని పట్టుబట్టారు.

తూకాల్లో క్వింటాలుకు 15 కిలోల వరకు మోసం జరిగిందని రైతులు ఆరోపించారు. కొనుగోలు చేసిన పత్తికి క్వింటాలుకు 15 కిలోల చొప్పున అదనంగా చెల్లించి పత్తి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. చివరకు క్వింటాలుకు ఐదు కిలోలకు అదనంగా డబ్బులు చెల్లిస్తానని కాసిం పాషా చెప్పడంతో రైతులు అంగీకరించారు. అయితే తూకాల్లో మోసాలు జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో తాము దళారుల చేతుల్లో నిలువునా మోసం పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు