నాగరికతను మింగేసిన వాతావరణం!

26 Dec, 2017 01:26 IST|Sakshi

అస్తవ్యస్త రుతుపవనాలతోనే సింధు, వేదకాలపు నాగరికతల పతనం

కాలిఫోర్నియా స్టేట్‌ వర్సిటీ ఆశీష్‌ సిన్హా పరిశోధనలో వెల్లడి

ఢిల్లీ సమీపంలోని సహియా గుహల్లో పరిశీలన

వేల ఏళ్ల కిందట వానల పరిస్థితిపై అంచనాలు

రుతుపవనాలు విఫలమవడంతో దశాబ్దాల పాటు కరువు వచ్చినట్లు నిర్ధారణ

నేటి భూతాపం, వాతావరణ మార్పులపై హెచ్చరిస్తున్న గత చరిత్ర  

భారతదేశంలో వేల ఏళ్ల కిందే ఎంతో అద్భుతమైన నాగరికతలు విలసిల్లాయి. సింధు, వేదకాలపు నాగరికతలు పెద్ద నగరాలు, ఇళ్లు, సామాజిక ఏర్పాట్లు, మెరుగైన వ్యవసాయ పద్ధతులతో వందల ఏళ్లు సుభిక్షంగా వర్ధిల్లాయి. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి అంతర్థానమైపోయాయి. దీనికి కారణం వాతావరణ మార్పులేనని ఇప్పటికే అంచనా వేసినా... ముఖ్యంగా నైరుతి రుతుపవనాల అస్తవ్యస్తతే ఆ నాగరికతలను అంతం చేసిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రస్తుతం భూతాపం, వాతావరణ మార్పులు ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో.. వాటి వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే దానికి సింధు, వేదకాలపు నాగరికతల అంతర్థానమే తార్కాణంగా నిలవనుంద      – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌


రుతుపవనాల వల్లేనా..?
సింధు, వేదకాలపు నాగరికతలు ఎలా అంతరించాయనే దానిపై ఇప్పటికే అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్యుల దండయాత్రలు మొదలుకొని.. సరస్వతి నది అంతర్వాహినిగా మారిపోవడం, కరువుల వరకు ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆర్యుల దండయాత్ర లేదని డీఎన్‌ఏ పరీక్షలతో ఇప్పటికే రుజువైంది. సరస్వతి నది దిశ మార్చుకుందని.. ఫలితంగా హరప్పా, మొహంజొదారో నగరాల ప్రాంతంలో కరువు వచ్చి నాగరికత అంతరించిందన్న వాదనకు పూర్తిస్థాయి ఆధారాలు లభించలేదు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన ఆశీష్‌ సిన్హా వినూత్న కోణంలో ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేశారు. పురాతన గుహల్లోని రసాయనాలను విశ్లేషించి... మన దేశానికి ఆయువు పట్టు అయిన నైరుతి రుతుపవనాలు అప్పట్లో ఎలా ఉండేవో అంచనా వేశారు. సుమారు 5,700 ఏళ్లకు సంబంధించిన అంచనాలు పరిశీలించగా... రుతుపవనాలు దీర్ఘకాలం బలహీన పడిన సందర్భాల్లోనే ఈ రెండు నాగరికతలు విచ్ఛిన్నమై, చివరకు అంతరించాయని నిర్ధారించారు.


వేదకాలం గురించి ఇప్పుడెందుకు?
ఎప్పుడో వేల ఏళ్ల కింద కరువు కాటకాలతో రెండు నాగరికతలు అంతమైతే.. వాటి గురించి ఇప్పుడెందుకన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే నైరుతి రుతుపవనాల తీరుపై ప్రస్తుతం మన వద్ద 150 ఏళ్ల సమాచారం మాత్రమే ఉంది. దాన్ని పరిశీలిస్తే వరుసగా రెండు మూడేళ్లకు మించి కరువొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.

మరి వరుసగా దశాబ్దాల పాటు కరువు కాటకాలు ఏర్పడితే పరిస్థితి ఏమిటన్నది సింధు, వేదకాలపు నాగరికతలను పరిశీలిస్తే తెలిసే అవకాశముంది. భూతాపం, వాతావరణ మార్పుల వంటి తాజా పరిణామాలను పరిశీలిస్తే... భవిష్యత్‌లో ఆ తరహా పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆశీష్‌ సిన్హా చెబుతున్నారు.  


ఢిల్లీ సహియా గుహల్లో పరిశోధన
ఢిల్లీకి ఉత్తరంగా 200 కిలోమీటర్ల దూరంలో సహియా గుహలున్నాయి. గంగా నదికి కొంచెం ఎగువన ఉన్న ప్రాంతమిది. అందువల్ల నైరుతి రుతుపవనాల్లో తేడా వస్తే.. అంటే కరువు వస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉండే చోటు ఇది. సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహల్లో స్టాల్గమైట్స్‌ ఉన్నాయి. చుక్కలు చుక్కలుగా నీళ్లు పడుతున్నప్పుడు కాలక్రమంలో అవి ఘనీభవించి ఏర్పడేవే స్టాల్గౖ మెట్స్‌. వర్షం పడినప్పుడు భూమిలోకి ఇంకిన నీరు.. ఈ గుహల్లో చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది.

ఆ నీరు ఘనీ భవించేటపుడు జరిగే రసాయన చర్యల వల్ల వాటిలో వేర్వేరు ఆక్సిజన్‌ ఐసోటోపులు (ఆక్సిజన్‌ పరమాణువులే అయినా.. వాటిల్లోని అనుఘటకాల సంఖ్య వేర్వేరుగా ఉండేవి) ఏర్పడతాయి. అంటే వానలు ఎక్కువగా పడితే ఒకలా.. లేదంటే మరోలా ఈ ఐసోటోపులు ఏర్పడతాయి. ఈ ఐసోటోపుల నిష్పత్తిని గణించిన ఆశీష్‌.. గతంలో అక్కడే ఏయే సమయాల్లో వర్షపాతం ఎలా ఉండేదో అంచనా వేశారు. మొత్తం గా విశ్లేషించగా వానలు కురవడం తగ్గిపోవడానికి.. నాగరికతలు అంతరించడానికి మధ్య సంబంధం స్పష్టమైంది.


వానల వెంటే నాగరికత
ఆశీష్‌ పరిశోధన ప్రకారం.. ఇప్పటికి సుమారు 4,550–3,850 ఏళ్ల మధ్య వర్షాలు విస్తారంగా కురిశాయి. ఆ సమయంలోనే సింధు నాగరికత వ్యవసాయాధార సమాజం నుంచి మహానగర నాగరికతగా మారినట్లు చరిత్ర చెబుతోంది. తరువాతి కాలంలో దీర్ఘకాలం కరువు కొనసాగడంతో ప్రజలు నగరాలు వదిలి వర్షపాతం ఎక్కువగా ఉన్న గంగా నది పరీవాహక ప్రాంతానికి వలస వెళ్లారని ఆశీష్‌ విశ్లేషిస్తున్నారు. ఇక వేదకాలపు సమాజం విషయానికొస్తే.. సుమారు 3,400 ఏళ్ల క్రితం వర్షాలు బాగా కురుస్తున్న సమయంలో సింధు నాగరికత ప్రాంతం నుంచి గంగా మైదానాలకు వలసలు పెరిగాయి.

అవే వేదకాలపు నాగరికతగా అభివృద్ధి చెందినట్లు ఆశీష్‌ చెబుతున్నారు (ఈ చొరబాట్లు ఆర్యులవని ఆయన అంచనా). మళ్లీ సుమారు 300 ఏళ్ల తరువాత రుతుపవనాలు బాగా బలహీనపడటంతో.. అప్పటి ప్రజలు ఇంకా తూర్పు ప్రాంతం వైపు వలస వెళ్లారు. అక్కడ 600 ఏళ్లపాటు వేదకాలపు నాగరికత కొనసాగింది. తరువాత తిరిగి రుతుపవనాలు బలహీనపడినప్పుడు వేదకాలపు సమాజం మహా జనపదాలుగా విడిపోయి.. క్రమేపీ అంతరించినట్లు అంచనా.

మరిన్ని వార్తలు