కల్నల్‌ సంతోష్ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

16 Jun, 2020 21:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  భారత - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్‌ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
(చదవండి : ః చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి)

 లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో  భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన ఇరుదేశాల సైనికుల ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు. (చదవండి : నా ఒక్కగానొక్క కొడుకు: సంతోష్‌ తల్లి)

మూడు నెలల క్రితమే సంతోష్‌ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు. సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సంతోష్‌ మృతిపట్ల పలువురు ప్రముఖులు నివాళ్లు అర్పిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి సంతోష్ బాబు భౌతికకాయాన్ని సూర్యాపేటకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
(చదవండి : ‘కల్నల్‌ సంతోష్‌ జీవితం యువతకు ఆదర్శం’)

మరిన్ని వార్తలు