శభాష్ పోలీసన్నా..

2 Mar, 2015 04:13 IST|Sakshi
శభాష్ పోలీసన్నా..

* కానిస్టేబుల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు
* పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో డబ్బులు ఇవ్వజూపినా
* తిరస్కరించిన నారాయణరావు

 
సాక్షి, హైదరాబాద్: శభాష్ పోలీసన్నా.. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు ఇవ్వజూపిన డబ్బును తిరస్కరించి పోలీసుల నిజాయతీని పెంచిన నగర స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.నారాయణరావును ఉద్దేశించి కేసీఆర్ అన్న మాట ఇది. ఆదివారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని కానిస్టేబుల్ నారాయణరావును సీఎం అభినందించారు.
 
వెస్ట్‌జోన్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నారాయణరావు విధి నిర్వహణలో భాగంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం జూబ్లీహిల్స్‌లోని ఓ దరఖాస్తుదారుడి ఇంటికి శనివారం ఉదయం వెళ్లాడు. పని పూర్తిచేసుకుని తిరిగివెళ్తున్న నారాయణరావును దరఖాస్తుదారుడి తండ్రి ఆపి.. కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా సున్నితంగా తిరస్కరించాడు. అయినా మరికొంత మొత్తాన్ని ఇవ్వబోగా ‘‘మా జీతాలను ముఖ్యమంత్రిగారు పెద్ద మొత్తంలో పెంచారు. మా బాగోగులను మంచిగా చూసుకున్నారు. కాబట్టి మాకు మీరిచ్చే డబ్బు అక్కర్లేదు’’ అనడంతో అశ్చర్యానికి గురైన సదరు వ్యక్తి నారాయణరావును ప్రశంసించారు. కాగా ఆ వ్యక్తే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి  ‘‘మీ పోలీసులు నిజాయతీగా పనిచేస్తున్నారు.
 
 డబ్బులు తీసుకోవాలని బల వంతం చేసినా తీసుకోలేదని’’ జరిగిన విషయం వివరించారు. కాగా ఆదివారం సీఎం కేసీఆర్ కానిస్టేబుల్ నారాయణరావును క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించి నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ వై.నాగిరెడ్డి, అదనపు డీసీపీ గోవర్ధన్‌రెడ్డి, ఏసీపీ కె.ప్రసాద్, ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కిరణ్‌ల సమక్షంలో ప్రశంసించారు. పోలీసుల పనితీరును మెరుగుపరిచేం దుకు  ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని ఈ ఘటన వెల్లడించిందని, పోలీసులందరు నారాయణరావును ఆదర్శంగా తీసుకుని నిజాయతీగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. నగర పోలీసులు చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని, దానికి సాక్షిగా నిలిచిన నారాయణరావును సీఎం ప్రశంసించడం నిజాయతీపరులైన పోలీసులందరిని ప్రశంసించినట్లేనని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు